
Adarsha Kutumbam Rumours: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’. శ్రీనిధి శెట్టి కథానాయిక కాగా.. నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేష్‌తో త్రివిక్రమ్ తొలిసారి కలిసి పనిచేస్తుండటంతో.. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఏకే 47 కథకు సంబంధించి గతంలో కొన్ని ఆసక్తికరమైన రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ రూమర్లు మరోసారి తెరపైకి వచ్చాయి.
ఆదర్శ కుటుంబం కథకు తమిళ, తెలుగు భాషల్లో సర్ప్రైజ్ హిట్‌గా నిలిచిన ‘బ్లాస్ట్’ సినిమాతో పోలికలు ఉన్నాయంటూ గతంలో ప్రచారం జరిగింది. అంతేకాదు ఆ సినిమా కథతో పోలికలు ఉండటంతో ఏకే 47 షూటింగ్‌ను కొంతకాలం ఆపి స్క్రిప్ట్‌లో మార్పులు చేశారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ ప్రచారంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా మూవీ థీమ్ గురించి డైరెక్టర్ త్రివిక్రమ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ పాత చర్చకు మరోసారి తెరలేపాయి. సినిమాలో ‘బ్లాక్ స్వాన్’ ఎఫెక్ట్ గురించి ఆయన ప్రస్తావించారు. ఊహించని వ్యక్తులు లేదా అనుకోని పరిణామాలు ఒక వ్యవస్థలోకి ప్రవేశించి.. అప్పటివరకు ఉన్న పరిస్థితులనే పూర్తిగా మార్చేయడమే బ్లాక్ స్వాన్ అని చెప్పుకొచ్చారు.
బ్లాస్ట్ కథలోనూ ఓ మిడిల్ క్లాస్ కుటుంబం అనుకోకుండా ఓ బడా బిజినెస్‌మ్యాన్ ప్లాన్‌లోకి ప్రవేశించడంతో.. కథలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ చెప్పిన బ్లాక్ స్వాన్ కాన్సెప్ట్‌కు, బ్లాస్ట్ కథలోని కొన్ని అంశాలకు పోలికలు ఉన్నాయంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రెండు సినిమాలకు పోలికలు ఉన్నాయా? లేదా? అన్నది పక్కనపెడితే.. ఈ చర్చ మాత్రం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అసలు త్రివిక్రమ్ ఎలాంటి కథను సిద్ధం చేశారు?.. బ్లాక్ స్వాన్ ఎఫెక్ట్‌ను సినిమాలో ఎలా చూపించబోతున్నారు?.. గతంలో వచ్చిన బ్లాస్ట్ పోలికల రూమర్లకు ఇందులో నిజంగా ఏదైనా ఆధారం ఉందా? అనే ప్రశ్నలకు సినిమా విడుదలైన తర్వాతే స్పష్టత రానుంది.