
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేవరకు రకరకాల ఆలోచనలు, పని ఒత్తిడితో మెదడు విసిగిపోతోంది. దీనివల్ల అతిగా ఆలోచించడం (ఓవర్‌థింకింగ్), మానసిక అలసట, ఆందోళన, చిరాకు వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మానసిక ప్రశాంతత కరువై ఎన్నో ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. అయితే ఈ మానసిక గందరగోళం నుంచి బయటపడి మనసును రీసెట్ చేసుకోవడానికి ఓ అద్భుతమైన మార్గం ఉంది. అదే జాతిపిత మహాత్మా గాంధీ పాటించిన ‘మౌన వ్రతం’. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న మెంటల్ టెన్షన్ నుంచి బయటపడేందుకు ఇదొక బెస్ట్ ఆప్షన్.
అసలేంటీ మౌన వ్రతం?
మౌనం అంటే కేవలం మాట్లాడకుండా ఉండటం మాత్రమే కాదు. మనసును మన అదుపులో ఉంచుకోవడం, ఆలోచనలను నియంత్రించుకోవడం, మన అంతరాత్మ చెప్పే మాటలను వినడం. ఇందుకోసం వారంలో ఒకరోజు పూర్తిగా మౌనం పాటించడం. గాంధీజీ ఇదే విధానాన్ని పాటించేవారు. ఆ రోజు ఆయన ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. అత్యవసరమైతే సైగలతో చెప్పడం లేదా కాగితంపై రాసి ఇవ్వడం చేసేవారు. ఇప్పటివారికి అర్థమయ్యేలా చెప్పాలంటే.. బయటి ప్రపంచ శబ్దాలను ‘మ్యూట్’ చేసి, లోపలి వ్యవస్థను ‘రీబూట్’ చేసుకోవడం అన్నమాట.
మౌన వ్రతం వల్ల కలిగే ప్రయోజనాలు
-
మెదడుకు ఉపశమనం: పూర్వకాలంలో ప్రజలు నెలల పాటు తెలుసుకునే సమాచారాన్ని ఇప్పుడు మనం ఒక్క రోజులోనే మెదడులోకి ఎక్కించుకుంటున్నాం. దానికితోడు వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు.. ఇవన్నీ కలిసి మెదడుపై తీవ్ర భారాన్ని మోపుతున్నాయి. అదే మన దినచర్యలో మౌన వ్రతాన్ని భాగం చేసుకుంటే, మెదడుకు నిరంతరం వచ్చే అనవసర డేటా నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
-
డిజిటల్ డిటాక్స్: మౌన వ్రతం పాటించడం వల్ల డిజిటల్ స్క్రీన్‌కు దూరంగా ఉంటారు. దీనివల్ల స్క్రీన్ టైమ్ కారణంగా వచ్చే సమస్యలు తగ్గి మెదడు సేదతీరుతుంది. ఇది బ్రెయిన్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. మీకు తెలియకుండానే స్క్రీన్ చూసే సమయం తగ్గిపోతుంది.
-
ఎమోషనల్ హీలింగ్: మౌనంగా ఉండటం వల్ల ఇతరులతో మాట్లాడటం తగ్గుతుంది. అప్పుడు మన మనసుతో మనం మాట్లాడటం మొదలుపెడతాం, మనసు చెప్పే మాటలను శ్రద్ధగా వింటాం. తద్వారా ఒత్తిడి తగ్గి, మానసిక గాయాలు వాటంతట అవే తగ్గుముఖం పడతాయి.
దీన్ని ఎలా అలవాటు చేసుకోవాలి?
దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. వారంలో ఒకరోజు లేదా రోజుకు అరగంట పాటు అన్నింటికీ దూరంగా కాసేపు మౌన వ్రతం పాటిస్తే చాలు. దీన్ని ఒక్కసారే అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. మెల్లగా మొదలుపెట్టండి. వారంలో మీకు వీలున్న రోజున 4–5 గంటల పాటు మౌనం పాటించడం అలవాటు చేసుకోండి.
ఈ సమయంలో ఫోన్, ల్యాప్‌టాప్, టీవీలను పూర్తిగా పక్కన పెట్టేయండి లేదా సైలెంట్ మోడ్‌లో ఉంచండి. ఈ ఖాళీ సమయాన్ని ధ్యానం (మెడిటేషన్), డైరీ రాయడం, ప్రకృతిని ఆస్వాదించడం లేదా ప్రాణాయామం వంటి లోతైన శ్వాస వ్యాయామాలకు కేటాయించండి. బయటి నుంచి వచ్చే శబ్దాలన్నీ ఆగిపోయినప్పుడే మీలో నిజమైన ఆత్మపరిశీలన మొదలవుతుంది. అప్పుడు మీతో మీరు మాట్లాడుకోండి.. మౌనం నేర్పే పాఠాలను వినండి.
బయటి శబ్దం ఎంత తగ్గితే, అంతర్గత ప్రశాంతత అంతగా పెరుగుతుంది. గాంధీ జయంతి సందర్భంగా ఆయన్ని కేవలం స్మరించుకోవడమే కాకుండా.. ఆయన చూపిన మార్గాలను అనుసరించడం ద్వారా మన జీవనశైలిలోనూ ప్రశాంతతను పొందవచ్చు. కాబట్టి వారంలో ఒక్కరోజైనా ఈ మౌనాన్ని పాటించి చూడండి.. మీలో వచ్చే సానుకూల మార్పును మీరే గమనిస్తారు!
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.