Reading Time: 2 minutes
Indian Railways: ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఇదొక్కటి మర్చిపోతే అంతే సంగతులు.. మిస్సయితే చిక్కులే..

రైళ్లల్లో ప్రయాణించేటప్పుడు కేవలం టికెట్ ఉంటే సరిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పు. కేవలం కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉంటే సరిపోతుందని అనుకోవద్దు. ఏదైనా ఒక గుర్తింపు ధృవీకరణ పత్రం తప్పనిసరిగా అవసరం. ఫోన్‌లో చూపించడం కంటే ప్రయాణం చేసేటప్పుడు ఒరిజినల్ కాపీ మీ వద్ద ఉంచుకోవడం మంచిది. ఒకే టికెట్‌పై ఎక్కువమంది ప్రయాణం చేసేటప్పుడు ఒరిజినల్ ఐడీ ఫ్రూఫ్ చూపించమని టీటీఈ అడిగే అవకాశముంటుంది. ఎవరో ఒకరి ఐడీ చూపిస్తే సరిపోతుంది. టికెట్‌లో పేరు ఉన్న వ్యక్తులు మాత్రమే ప్రయాణిస్తున్నారా.. లేదా అనేది నిర్దారించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. రైల్వే నిబంధనలు ఏం చెబుతున్నాయి..? ప్రూఫ్ ఎప్పుడు అవసరం? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఐడీ ప్రూఫ్ ఎప్పుడెప్పుడు అవసరం..?

గ్రూప్ బుకింగ్స్ సమయంలో ఒరిజినల్ ఐడీ అనేది అవసరం. అలాగే ఒకే వ్యక్తి కన్పార్మ్‌డ్ టికెట్‌పై ప్రయాణిస్తున్నా అతడికి సంబంధించి ఏదైనా ఐడీ ప్రూఫ్ దగ్గర ఉంచుకోవాలి. టికెట్ కొనుగోలు చేసిన అసలైన వ్యక్తి ప్రయాణిస్తున్నాడా.. లేదా? అనేది నిర్ధారించుకునేందుకు టీటీఈ ఐడీ ప్రూఫ్ అడిగే అవకాశం ఉంటుంది. దీంతో ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మీ దగ్గర ఏదైనా ఐడీ ప్రూఫ్ ఉంచుకోవాలి. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్, విద్యార్థి ఐడీ కార్డ్, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏదైనా ఫొటో ఐడీ చూపించవచ్చు. ఇక రాయితీ టికెట్లు, ప్రత్యేక రిజర్వేషన్ కోటా, పాసులపై ప్రయాణించేవారు తమ అర్హతను నిరూపించుకునేందుకు ఒరిజినల్ ఐడీ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ-పాస్, ప్రివిలేజ్ టికెట్ఆర్డర్‌పై ప్రయాణించేవారు కూడా ఐడీ దగ్గర ఉంచుకోవాలి.

రాయితీకి అర్హులా..? కదా..?

రాయితీ, ప్రత్యేక కోటా టికెట్లపై ప్రయాణం చేస్తున్నప్పుడు మీ వద్ద టికెట్లు నిజమైనవేనా.. మీరు రాయితీకి అర్హులా.. కాదా అనేది నిర్దారించేందుకు ఐడీ ప్రూప్స్ ఉపయోగడతాయి. ఒకవేళ మీ దగ్గర ఐడీ పత్రాలు లేకపోతే రైల్వే అధికారులు చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. అన్‌రిజర్వుడ్ టికెట్లను తనిఖీ చేసేందుకు కూడా టీటీఈలు తమ దగ్గర ఉండే ప్రత్యేక యాప్‌ను ఉపయోగిస్తున్నారు. దివ్యాంగులు, వృద్దులకు ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది. వారికి బెర్త్‌ల కేటాయింపుల్లో ప్రత్యేక రిజర్వేషన్ ఉంటుంది. దీంతో వారి అర్హతలను నిర్దారించడానికి ఐడీ ప్రూఫ్ అవసరం పడుతుంది. టీటీఈలకు అనుమానం వస్తే అడిగే అవకాశం ఉంటుంది. దీంతో అర్హతలకు సంబంధించిన డాక్యుమెంట్స్ రైలు ప్రయాణం చేసేటప్పుడు వెంట తీసుకెళ్లాలి.