Reading Time: 2 minutes
24 ఏళ్లుగా కొడుకు జాడ కోసం ఎదురుచూపులు.. సాధువు వేషం వేసి నకిలీ కొడుకు నాటకం! చివర్లో సినీ ఫక్కీ ట్విస్ట్‌

ఇబ్రహీంపట్నం, అక్టోబర్‌ 2: 24 ఏళ్లుగా కనిపించకుండా పోయిన కుమారుడు తిరిగి వచ్చాడన్న ఆశతో ఎదురుచూస్తున్న ఓ వృద్ధుడిని ఇద్దరు వ్యక్తులు మోసం చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగుచూసింది. కొడుకు జాడ కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న తండ్రి భావోద్వేగాలను ఆసరాగా చేసుకున్న నిందితులు. ఓ వ్యక్తికి సాధువు వేషం వేయించి అతడే తప్పిపోయిన కుమారుడంటూ నమ్మించారు. అనంతరం మతపరమైన కార్యక్రమాల పేరుతో రూ.10 వేలు తీసుకుని మోసానికి పాల్పడ్డారు. చివరకు బాధితుడికి అనుమానం రావడంతో అసలు వ్యవహారం బయటపడింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం సీతారాంపేట్‌కు చెందిన పిషాటి లక్ష్మారెడ్డికి ఒక కుమారుడు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి సుమారు 24 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుమారుడి కోసం ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. ఈ పరిస్థితిని గమనించిన మోహన్‌రెడ్డి అనే వ్యక్తి.. లక్ష్మారెడ్డి బంధువు ద్వారా పరిచయం పెంచుకుని, ఆయనకు ఓ కథ చెప్పాడు.

చెరువుగట్టు దేవాలయం వద్ద సాధువు రూపంలో ఉన్న వ్యక్తి.. వృద్ధుడి తప్పిపోయిన కుమారుడేనని నమ్మించాడు. దీంతో కుమారుడు దొరికాడన్న ఆనందంతో లక్ష్మారెడ్డి సెప్టెంబర్‌ 20న అక్కడికి వెళ్లారు. అక్కడ సాధువు వేషంలో ఉన్న యాదయ్యను శ్రీనివాస్‌రెడ్డిగా మోహన్‌రెడ్డి పరిచయం చేశాడు. అంతేకాకుండా యాదయ్యతో కుమారుడి పేరుతో ఫోన్‌లో మాట్లాడించాడు. దీంతో లక్ష్మారెడ్డి అతడిని నిజంగానే తన కుమారుడిగా భావించారు. కొద్దిరోజుల తర్వాత మోహన్‌రెడ్డి మరోసారి వృద్ధుడి వద్దకు వెళ్లి.. సాధువు వేషంలో ఉన్న వ్యక్తి స్వామి మాలలో ఉన్నాడని, దానిని తొలగించేందుకు ఖర్చు అవుతుందని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన లక్ష్మారెడ్డి రూ.10 వేల నగదును ఇచ్చారు. అయితే ఆ తర్వాత సాధువు వ్యవహారశైలిపై అనుమానం కలిగిన ఆయన సెప్టెంబర్‌ 27న ఇబ్రహీంపట్నంలోని భారత్‌ గార్డెన్స్‌ వద్ద యాదయ్యను కలసి తన కుమారుడేనని నిర్ధారించుకునే ప్రయత్నం చేశారు. ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు రావడంతో నిలదీయగా.. చివరకు యాదయ్య అసలు విషయాన్ని అంగీకరించాడు.

తాను శ్రీనివాస్‌రెడ్డిని కాదని, మోహన్‌రెడ్డి సూచనతోనే సాధువు వేషం వేసి లక్ష్మారెడ్డిని నమ్మించినట్లు వెల్లడించాడు. డబ్బులు సంపాదించేందుకు ఇద్దరూ కలిసి ఈ నాటకానికి తెరతీసినట్లు చెప్పడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు సెప్టెంబర్‌ 27న ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి మోహన్‌రెడ్డి, యాదయ్యపై బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 318(4), 319(2), 3(5) కింద కేసు నమోదు చేశారు. మోసం చేయడం, మరో వ్యక్తిగా నటించడం, ఉమ్మడి ఉద్దేశంతో నేరానికి పాల్పడిన అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.