
- 20 ఏండ్లలో మూడు హోటళ్లు అయినయ్
- పాలిటిక్స్‌లోకి రాకుంటే 10 అయితుండె
- ఇవి 2009 ఎన్నికల అఫిడవిట్లో ఉన్నవే!
- నా భార్యాపిల్లలకు బువ్వ పెట్టేందుకు వ్యాపారం చేసుకుంటే తప్పా
- సీఎం రేవంత్ బురద చల్లుడు మానుకోవాలె
- ఫార్ములా ఈ రేసు కేసులో ఏం తేల్చారు
- మేం తాతల కాలం నుంచి భూస్వాములం
- రేవంత్.. మీ ఆస్తులు, మా ఆస్తులపై
- సుప్రీం జడ్జితో విచారణ చేయిద్దామని సవాల్
హైదరాబాద్, వెలుగు: తాను అమెరికాలో కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతోనే హోటళ్లు ప్రారంభించానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అమెరికాలో ఆరేండ్లు ఉద్యోగం చేసి సంపాదించిన పైసలతో 2006లో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఒక హోటల్ పెట్టానని, 20 ఏండ్లలో మూడు హోటళ్లు అయ్యాయని, అదే రాజకీయాల్లోకి రాకుండా ఉంటే మూడు హోటళ్లు కాస్తా పది హోటళ్లు అయ్యేవని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆర్మూర్ నియోజకవర్గ నేతలు పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు.
“సీఎం బురద జల్లుతడు.. మనం కడుక్కోవాలె అన్నట్టుంది పరిస్థితి. 2009లో తొలిసారి పోటీ చేసినప్పుడే ఎన్నికల నోటరైజ్డ్ అఫిడవిట్ లో నా ఆస్తిపాస్తులు, అప్పులు, హోటళ్ల వివరాలన్నీ స్పష్టంగా రాసి ఇచ్చిన. ఆ అఫిడవిట్ లో ఉన్న ముచ్చట్లను పట్టుకుని రేవంత్ రెడ్డి ఏదో కొలంబస్, వాస్కోడిగామా కనుగొన్నట్టు చెప్తున్నడు. నా హోటళ్లకు ఫ్రీగా పబ్లిసిటీ ఇచ్చినందుకు రేవంత్ కు ధన్యవాదాలు.
నా భార్యాపిల్లలకు బువ్వ పెట్టేందుకు వ్యాపారం చేసుకుంటే తప్పా?” అని ప్రశ్నించారు. అలాగే, తమ కుటుంబ ఆస్తులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించేందుకు సిద్ధమా అని కేటీఆర్ సవాల్ విసిరారు. తమ తాతల కాలం నాటి ఆస్తుల నుంచి మొదలుకొని రేవంత్ కుటుంబ తాతల ఆస్తుల వరకు.. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఆ విచారణలో తమ తప్పేమైనా ఉందని తేలితే ఏ శిక్షకైనా తాను సిద్ధమని ప్రకటించారు. రేవంత్ రెడ్డి ఒక భాషలో దూషిస్తే, తాము నాలుగు భాషల్లో ఎదురుదాడి చేయగలమని, తిట్టగలమని హెచ్చరించారు.
ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా రైతుల గోస..
రాష్ట్రంలో ఏ మూలకు పోయినా అన్నదాతల కన్నీళ్లే కనిపిస్తున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, అలంపూర్, కొల్లాపూర్, భద్రాచలం, బాసర.. ఎక్కడికెళ్లినా రైతుబంధు రాక, కరెంట్ లేక, యూరియా దొరక్క రైతులు అల్లాడుతున్నార ని చెప్పారు. తాను కొల్లాపూర్ వెళ్తుంటే గుమ్మడం సబ్ స్టేషన్ వద్ద రైతులు తనను ఆపి ఆరు గంటల కరెంట్ కూడా రావడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నా రని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్కఫోన్ కొడితే పొలం గట్టు వద్దకు యూరియా వచ్చేదని, ఇప్పుడు మళ్లీ పాత రోజులు వచ్చాయని రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. “మోస పోకండి.. మోసపోతే గోసపడతరు అని కేసీఆర్ ఆనాడే చెప్పిన మాట నేడు అక్షరాలా నిజమైంది. పదేండ్లు అయింది కదా.. కొత్తవాళ్లను చూద్దామని అనుకుంటే, 50 ఏండ్లు రైతాంగాన్ని సావగొట్టిన కాంగ్రెస్సే మళ్లీ నెత్తికెక్కింది. వెనకటి రోజులు మళ్లీ తెస్తానని చెప్పి.. నిజాయతీగా కరెంట్ లేని, నీళ్లు లేని రోజులు తెచ్చిన మోసగాడు రేవంత్ రెడ్డి” అని ఎద్దేవా చేశారు.
అన్నీ అబద్ధాలే.. కమిషన్లన్నీ ఏం తేల్చాయి.?
రేవంత్ రెడ్డి నిత్యం ప్రజల దృష్టి మళ్లించేందుకు పచ్చి అబద్దాలు చెప్తున్నారని కేటీఆర్ విమర్శిం చారు. గతంలో సెక్రటేరియెట్ కింద సొరంగాలు ఉన్నాయని, కేసీఆర్ లంకెబిందెలు తవ్వుకుంటు న్నారని, రాజభవనం కట్టుకుని 150బెడ్ రూంలు, బంగారు బాత్రూంలు పెట్టారని ప్రచారం చేశారని, ఇప్పుడు అందులో ఎవరు ఉంటున్నారో ప్రజలు చూస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజె క్టుకు అయిన మొత్తం ఖర్చే రూ.80 వేల కోట్లయితే, లక్ష కోట్ల అవినీతి జరిగిందని అబద్ధాలు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక కాళేశ్వరంపై కమిషన్ వేస్తే, విద్యుత్ కొ నుగోళ్లపై విచారణ, ఫార్ములా ఈ రేసు మీద కేసు పెట్టినా ఏమీ తేలలేదని. ఫోన్ ట్యాపింగ్ అని చేసిన హడావుడి కూడా తుస్సుమన్నదని చెప్పారు. 420 హామీలు, ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయలేదని ప్రజలు నిలదీస్తారనే భయంతోనే రేవంత్ రోజూ కొత్త డ్రామాలు ఆడుతున్నారని
ఆరోపించారు.
నల్లమల పులివి కాదు.. చంద్రబాబు దగ్గర పిల్లివి..
సిరిసిల్ల పర్యటనలో రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరుపై కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “సిరిసిల్లలో కాంగ్రెస్ పాలన వచ్చాక 35 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు, రంజాన్, క్రిస్మస్ బట్టల ఆర్డర్లు. పాఠశాల విద్యార్థుల యూనిఫాం ఆర్డర్లు రద్దు చేసి నేతన్నల నోట్లో మట్టికొట్టారు. సిరిసిల్ల పర్యటనకు వచ్చిచనిపోయిన కార్మికులకు రూ.10-20 లక్షల పరిహారం ప్రకటిస్తారనుకుంటే, నేతన్న బీమా గురించి చెప్తారనుకుంటే ఒక్క మాటా మాట్లాడలే దు. పైగా శత్రుదేశంపై దండయాత్రకు వెళ్లినట్టు 4 వేల మంది పోలీసులను వెంటేసుకుని వెళ్లారు. ఉదయం నుంచే బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయించి, దుకాణాలు బంద్ చేయించారు. రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు అమ్ముకునేవాళ్లను కూడా రోడ్డుపై లేకుండా తరిమేశారు. రేవంత్ తనను తాను నల్లమల పులి అనుకుంటున్నాడు… 4 వేల మంది పోలీసులతో వెళ్లేటోడు పులి ఎట్లయి తడు? నువ్వు నల్లమల పులివి కాదు.. చంద్రబాబు దగ్గర పిల్లివి” అని ఎద్దేవా చేశారు.
సీఎం అయిన మూడేండ్లలోనే రేవంత్ రెడ్డికి ఇంత ప్రస్టేషన్ ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు.. కాంగ్రెస్ సీనియర్లందరినీ తొక్కుకుంటూ సీఎం అయి సంతోషంగా ఉండాల్సింది పోయి, రోజుకో విమర్శ చేస్తూ కాలం గడుపుతున్నారని మండిపడ్డా రు. ”నీ బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేక పోయినా రూ. వెయ్యి కోట్ల అమృత్ టెండర్లు ఎలా ఇచ్చావని అడిగితే కోపం వస్తది. తొమ్మిదో తరగతి ఫెయిలైన నీ తమ్ముడు కొండల్ రెడ్డి రాత్రికి రాత్రే ఏరోస్పేస్ ఇంజనీరై కంపెనీ పెడితే.. రూ.200కోట్ల విలువైన భూమిని రూ.7 కోట్లకే ఎలా కట్టబెట్టావ ని అడిగితే కోపం వస్తుంది. అమెరికాలో ఉండే మీ అన్న జగదీశ్ రెడ్డి ఇక్కడికి వచ్చి రూ. వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతానంటే, అదానిని మించిపోతున్నా రని అడిగితే ఉక్రోషం వస్తది. మా నాన్న కేసీఆర్ 1983 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 1985లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 43 ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో కేంద్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా.. సీఎంగా పనిచేశారు. మా తాతల కాలం నుంచి వందల ఎకరాల ఆస్తులున్నాయి. నేను నిజాం కాలేజీలో డిగ్రీ, పుణే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదివి, అమెరికాలో చదువుకుని ఉద్యోగం చేసిన. నీలాగా డిగ్రీ పాస్ కావడానికి ఎనిమిదేండ్లు చద వలేదు. గోడలకు పెయింట్లు వేసుకునే నీ స్థాయి ఏంది? నువ్వు మాట్లాడే మాటలేంది?” అని నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్కు గతం తప్ప.. భవిష్యత్తు లేదు..
ఎన్నికల సమయంలో బాండ్ పేపర్లు రాసిచ్చి మూడు నెలల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్, మూడేండ్లయినా ఒక్క హామీని నిలబెట్టుకోలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. దళితబంధు రూ.12 లక్షలు ఇవ్వలేదని, బీసీలకు రూ. లక్ష కోట్లు ఇవ్వలేదని, కాంట్రాక్టులన్నీ పొంగులేటికే తప్ప బీసీలకు దక్కడం లేదని విమర్శించారు. కేసీఆర్ కిట్, రైతుబీమా, బతుకమ్మ చీరలు, నిరుద్యోగులకు రావాల్సిన రెండు లక్షల ఉద్యోగాల ఊసే లేదని చెప్పారు. మోదీ 2014లో డబుల్ ఇన్ కం, బుల్లెట్ ట్రెయిన్, 5 ట్రిలియన్ ఎకానమీ అని మోసం చేస్తే, రేవంత్ అంతకంటే దారుణంగా మోసం చేశారని విమర్శించారు. గణేష్ నిమజ్జనం రోజున కూడా ప్రజలు పాటలు పెట్టుకుని కేసీఆర్ పాలనను యాది చేసుకుంటున్నారని, కేసీఆర్ వస్తేనే తెలంగాణ మళ్లీ పట్టాలెక్కుతుందని ప్రజలంతా బలంగా నమ్ముతున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో అడుగుపెడితే ఆ పార్టీ భస్మమవుతుందని, టీడీపీని బొందపెట్టినట్టేరాబోయే 25 ఏండ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్రజలు ఓటు వేయకుండా ఆ పార్టీని ఖతం చేసి పోతాడని కేటీఆర్ హెచ్చరించారు.