Reading Time: < 1 minute

ఎమ్మెల్సీ ఎన్నికలకు సహకరించాలి .. పార్టీల నాయకులను కోరిన ఆర్వీ కర్ణన్

Caption of Image.
  • నవంబర్‌‌ 6 వరకు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు
  • డిసెంబర్‌‌ 30న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని వెల్లడి

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌–రంగారెడ్డి–మహబూబ్‌‌నగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పొలిటికల్ పార్టీల నాయకులు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ కోరారు. గురువారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్‌‌ 6 వరకు అర్హులైన గ్రాడ్యుయేట్లు ఫారం–18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నియోజకవర్గంలో ఇదివరకు జరిగిన ఎన్నికల్లో ఓటరుగా నమోదైన వారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

అర్హత ఉన్న వారు ఆన్‌‌లైన్‌‌లో లేదా ఆఫ్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. 2026 నవంబర్‌‌ 1 నాటికి కనీసం మూడేండ్ల ముందు (2023 అక్టోబర్‌‌ 31లోపు) డిగ్రీ లేదా సమాన అర్హత పొందిన వారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులన్నారు. నవంబర్‌‌ 25న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తామని తెలిపారు. అభ్యంతరాల స్వీకరణకు నవంబర్‌‌ 25 నుంచి డిసెంబర్‌‌ 10 వరకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తుది ఓటర్ల జాబితాను డిసెంబర్‌‌ 30న ప్రకటిస్తామని వెల్లడించారు. 

డిజిగ్నేటెడ్ అధికారుల నియామకం..

గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి 9 జిల్లాల్లోని 19 ఆర్డీవోలను ఏఈఆర్వోలుగా, తహసీల్దార్లు, జీహెచ్‌‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, సికింద్రాబాద్‌‌ కంటోన్మెంట్‌‌ సీఈవో తదితరులను డిజిగ్నేటెడ్ అధికారులుగా నియమించామని ఆర్వీ కర్ణన్ తెలిపారు. వీరు ఫారం–18ను స్వీకరించి అర్హత, ధ్రువపత్రాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో 616 పోలింగ్‌‌ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు.సమావేశంలో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (ఎలక్షన్స్) సంతోష్, ఇతర అధికారులు, ఆయా రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.