
బాలీవుడ్ లో అత్యంత క్రేజ్ ను సొంతం చేసుకున్న ఫ్రాంచైజీల్లో ‘దృశ్యం’ ఒకటి. స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్, టబు ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సిరీస్ కు ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ కథకు ముగింపు పలుకుతూ అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దృశ్యం: ది కన్ క్లూజన్ ‘ అక్టోబర్ 2న థియేటర్లలోకి వచ్చింది. మరి ఎన్నో ఏళ్లుగా వెంటాడుతున్న విజయ్ సల్గావ్కర్ కథకు ఈ చిత్రం ఎలాంటి ముగింపు ఇచ్చింది? ప్రేక్షకులను మరోసారి అదేస్థాయిలో ఉత్కంఠకు గురిచేసిందా? చూద్దాం..
కథేంటంటే?
ఈ ‘దృశ్యం: ది కన్ క్లూజన్ ‘ ను మలయాళ రీమేక్ గా కాకుండా.. సరికొత్త ఓరిజినల్ కథతో తెరకెక్కించింది బాలీవుడ్ టీమ్. ‘దృశ్యం 2’ పరిణామాల తర్వాత మీరా దేశ్ ముఖ్ ( టబు ) తన కుమారుడు మరణం వెనుక అసలు నిజం ఏమిటో తెలియక మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు కూడా యత్నిస్తుంది. అంతే కాదు ఈకేసును మరోసారి తెరపైకి తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది. తన భర్త మహేశ్ ( రజత్ కపూర్ ) సహాయంతో కేసును రీఓపెన్ చేయించి.. విజయ్ సల్గావ్కర్ ( అజయ్ దేవ్ గణ్ ) ను ఎలాగైనా జైలుకు పంపాలని ప్రయత్నిస్తుంది.
ఇందుకోసం క్రైమ్ బ్రాంచ్ పవర్ ఫుల్ ఎస్పీ రాజ్‌వీర్ సింగ్ (జైదీప్ అహ్లావత్), సీనియర్ లాయర్ ఇంద్రజిత్ శెట్టి (ప్రకాష్ రాజ్)లను రంగంలోకి దింపుతాడు. దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న సమాధిని తవ్వడానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో విజయ్ కుటుంబం మళ్లీ చిక్కుల్లో పడుతుంది. అయితే పోలీసులు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ విజయ్ కూడా తనదైన శైలిలో మరో ఎత్తు వేస్తుంటాడు . మరి ఈసారి విజయ్ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? పోలీసులకు, న్యాయ వ్యవస్థకు ఎలా చెక్ పెట్టాడనేదే అసలు కథ.
ఎలా ఉందంటే?
‘దృశ్యం’ సిరీస్‌కు బలమైన అంశం ఎప్పుడూ విజయ్ ఎలా తప్పించుకున్నాడు? అనే ప్రశ్నే. ఈసారి కూడా దర్శకుడు అదే ఆసక్తిని కొనసాగిస్తూ, గతంలో సమాధానం దొరకని అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా విజయ్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి వేసిన ఎత్తులు, పోలీసులు గుర్తించలేని క్లూస్, కోర్టు సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతాయి.
ఫస్ట్ హాఫ్‌లో పోలీస్ ఇన్వెస్టిగేషన్, టెన్షన్, కామెడీని చక్కగా మిక్స్ చేశారు. ముఖ్యంగా విజయ్, రాజ్‌వీర్ మధ్య జరిగే మైండ్ గేమ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే కీలక సన్నివేశం సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతుంది.
సెకండాఫ్‌లో కథ కోర్టు రూమ్ వైపు మళ్లుతుంది. ఇక్కడ వచ్చే వాదనలు, ట్విస్టులు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి. అయితే విజయ్ ప్లాన్ ఎలా వర్కవుట్ అయిందో వివరించే క్రమంలో కొన్ని పరిష్కారాలు కాస్త సౌకర్యవంతంగా అనిపిస్తాయి. కొన్ని ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు పూర్తిగా కన్విన్సింగ్‌గా లేకపోవడం, కొన్ని కీలక క్లూస్‌ను పోలీసులు ఎలా మిస్ అయ్యారనే సందేహం రావడం మైనస్.
ఎవరెవరు ఎలా చేశారంటే?
అజయ్ దేవ్‌గణ్ మరోసారి విజయ్ సల్గావ్కర్ పాత్రలో తనదైన కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆయన ప్లానింగ్ సీన్లకైతే ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే. టబు కోపం, బాధ, నిస్సహాయతను బలంగా చూపించింది. రజత్ కపూర్ తన పరిధిలో చక్కగా నటించాడు. అయితే ఈ సినిమాకు అసలైన సర్‌ప్రైజ్ ప్యాకేజ్ జైదీప్ అహ్లావత్. రాజ్‌వీర్ పాత్రలో ఆయన చూపించిన అథారిటీ, మేనరిజమ్స్, మెనాస్ సినిమాకు అదనపు బలంగా నిలిచాయి. అయితే ఇంత పవర్‌ఫుల్‌గా పరిచయం చేసిన పాత్రను కథనం పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయిందనే భావన కలుగుతుంది. ప్రకాశ్ రాజ్, శ్రియా శరణ్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఫ్యాన్స్ కు మరోసారి థ్రిల్ ..
‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ పూర్తిగా పర్ఫెక్ట్ థ్రిల్లర్ కాకపోయినా, విజయ్ సల్గావ్కర్–పోలీసుల మధ్య పదేళ్లుగా సాగుతున్న మైండ్ గేమ్‌కు ఆసక్తికరమైన ముగింపు ఇచ్చే ప్రయత్నం చేసింది. క్లైమాక్స్‌ను కొంతవరకు ఊహించగలిగినా, అక్కడికి కథను ఎలా తీసుకెళ్లారనేదే అసలు ఆసక్తి. బలమైన నటన, టెన్షన్ క్రియేట్ చేసే స్క్రీన్‌ప్లే, కోర్టు సన్నివేశాలు, జైదీప్ అహ్లావత్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్ గా నిలిచాయి. కొన్ని కన్వీనియెంట్ సొల్యూషన్స్, లాజిక్ గ్యాప్స్ మైనస్‌లు అయినప్పటికీ ‘దృశ్యం’ అభిమానులను మరోసారి థ్రిల్ చేసే అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి..