
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదిన్నర లక్షల మంది ఉద్యోగులు నాలుగు కోట్ల ప్రజలకు సేవలు అందిస్తున్నారన్నారు. ఉద్యోగులు కష్టపడితేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. బుధవారం (సెప్టెంబర్ 30) సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు.
ఈ సందర్భంగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జిల్లా సమగ్ర అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు చేరాలంటే ఉద్యోగుల పాత్ర కీలకమని చెప్పారు. సమస్యలతో వచ్చే ప్రజలకు సాయం చేయడం మన బాధ్యత అని ఉద్యోగులకు సూచించారు.
సమస్యల్లో ఉన్న ప్రజలను మన కుటుంబ సభ్యుల్లా చూడాలన్నారు. ప్రస్తుతం ఎన్నో సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించాలని సూచించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు అని.. మిగితా సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఉంటాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తానని చెప్పారు.