
Irumudi vs Baahubali 2 6th Week Collections: బాక్సాఫీస్ వద్ద ఆధ్యాత్మిక చిత్రం ‘ఇరుముడి’ హవా కొనసాగుతోంది. విడుదలైన ఆరో వారంలోనూ ఈ సినిమా అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ.. టాప్ మూవీస్ జాబితాలో సత్తా చాటింది. ముఖ్యంగా ఆరో వారంలో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన తెలుగు వెర్షన్ సినిమాల జాబితాలో ఇరుముడి రూ.3.46 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఇప్పటివరకు టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ రూ.2.65 కోట్ల నెట్ వసూళ్లతో ముందంజలో ఉండేది. అయితే ఇరుముడి ఆరో వారంలో రూ.3.46 కోట్ల నెట్ వసూళ్లు సాధించి బాహుబలి 2ను అధిగమించింది. దీంతో దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తెలుగు వెర్షన్ సినిమాల ఆరో వారం వసూళ్లలో కొత్త రికార్డు నమోదైంది.
ఆరో వారంలో అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన సినిమాల జాబితాను పరిశీలిస్తే.. ఇరుముడి రూ.3.46 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. బాహుబలి 2 రూ.2.65 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. ‘మన శంకర వరప్రసాద్’ రూ.2.04 కోట్లు, ‘కల్కి 2898 ఏడీ’ రూ.2.00 కోట్లు, ‘మహావతార్ నరసింహ’ రూ.1.93 కోట్లు, ‘పుష్ప 2’ రూ.1.61 కోట్ల నెట్ వసూళ్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇరుముడి ఆరో వారంలో బాహుబలి 2 కంటే భారీ మార్జిన్‌తో ముందంజలో నిలవడం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సాధారణంగా విడుదలైన కొన్ని వారాల తర్వాత సినిమాల వసూళ్లు తగ్గుతుంటాయి. అయితే ఇరుముడి మాత్రం ఆరో వారంలోనూ బలమైన వసూళ్లను నమోదు చేస్తూ తన సత్తా చాటుతోంది.
బాక్సాఫీస్ వద్ద ఇరుముడి సాధిస్తున్న ఈ జోరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓటీటీలో రిలీజ్ అయినా కూడా ప్రేక్షులు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. రూ.228 కోట్లు వసూల్ చేసింది. మరిన్ని రోజులు ఇదే స్థాయిలో వసూళ్లను కొనసాగిస్తే.. ఇరుముడి బాక్సాఫీస్ పరంగా మరిన్ని రికార్డులను నమోదు చేసే అవకాశం ఉంది. ఈ మూవీ మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కింది. రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించగా.. కూతురిగా బేబీ నక్షత్ర నటించింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది.