
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు ఏపీ హైకోర్టు తీర్పుతో కీలక మలుపు తిరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోపు ప్రారంభించాలని ఆదేశించింది.
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 105, 1065ను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ జీవోలు సుప్రీంకోర్టు నిర్దేశించిన రిజర్వేషన్ల పరిమితికి విరుద్ధంగా ఉన్నాయంటూ పిటిషనర్లు వాదించారు. ఈ అంశంపై హైకోర్టు గతంలోనే తీర్పును రిజర్వ్ చేసింది.
అలాగే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పైనా కోర్టు విచారణ జరిపింది. బీసీల జనగణన, సమగ్ర సర్వే పూర్తయిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌తో పాటు వార్డుల పునర్విభజన, గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు కూడా విచారణకు వచ్చాయి.
బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం సమర్పించిన వాదన ప్రకారం.. 34 శాతం కోటా సమకాలీన బీసీ జనాభా లెక్కలు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఆధారంగా నిర్ణయించినట్లు పేర్కొంది. హైకోర్టు తాజా ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయ్యింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్ తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..