కావలసిన పదార్థాలు: అర కేజీ పెద్ద ఉసిరికాయలు, అర కేజీ బెల్లం తురుము, పావు ఇంచ్ ముక్క అల్లం, పావు టీస్పూన్ నల్ల ఉప్పు, పావు టీస్పూన్ మిరియాల పొడి, పావు టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, పావు టీస్పూన్ గరం మసాలా పొడి, పావు టీస్పూన్ కారం పొడి, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ యాలకుల పొడి, 1 నుండి 2 టేబుల్ స్పూన్ల దోరగా వేయించిన దోసగింజలు / పుచ్చగింజలు, 1 టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసం
తయారీ విధానం: అర కేజీ తాజా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి. తురుముకునే శ్రమ లేకుండా త్వరగా అవ్వడం కోసం గింజలను తీసేసి ఉసిరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కట్ చేసిన ఉసిరి ముక్కలు, చిన్న అల్లం ముక్క వేసి పల్స్ మోడ్‌లో ఆపుతూ బరకగా (తురిమిన టెక్స్చర్ వచ్చేలా) గ్రైండ్ చేసుకోవాలి.
ఈ రెసిపీకి నాన్‌స్టిక్ లేదా స్టీల్ పాన్ మాత్రమే వాడాలి. ఇనుప పాత్రలను అస్సలు ఉపయోగించకూడదు. పాన్‌లో బరకగా రుబ్బిన ఉసిరికాయ తురుము, అర కేజీ బెల్లం తురుము వేసి బాగా కలపాలి. స్టవ్‌పై పెట్టి మీడియం మంటపై మూతపెట్టి 6 నుండి 7 నిమిషాలు ఉడికించాలి. నీళ్లు పోయాల్సిన అవసరం లేదు; బెల్లం కరిగి ఉసిరిలోని సహజ నీటితోనే మిశ్రమం చక్కగా ఉడుకుతుంది.
పాకం కాస్త చిక్కబడి హల్వాలా దగ్గరకు వస్తున్నప్పుడు పావు టీస్పూన్ చొప్పున మిరియాల పొడి, నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, పసుపు వేసి కలపాలి. ఈ మసాలాల వల్ల మురబ్బాకి చట్పటా రుచి వస్తుంది. మిశ్రమం మరింత దగ్గరపడ్డాక చేత్తో తాకి చూస్తే లైట్ తీగపాకంలా సాగాలి. ఇప్పుడు యాలకుల పొడి, నేతిలో లేదా డ్రైగా వేయించిన పుచ్చగింజలు వేసి కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి.
స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 5 నిమిషాలు చల్లారనిచ్చి, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండాలి. నిమ్మరసం కలపడం వల్ల బెల్లం పాకం గట్టిపడి క్రిస్టలైజ్ అవ్వకుండా జ్యూసీగా ఉండి, మురబ్బా పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. పూర్తిగా చల్లారాక పొడి గాజు సీసాలో భద్రపరుచుకుంటే ఏడాది పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో ఉంచితే రంగు మారకుండా తాజాగా ఉంటుంది. రోజుకో స్పూన్ తిన్నా శరీరానికి అపారమైన శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది!




