
గద్వాల, వెలుగు: మున్సిపల్ షాపుల కిరాయి వసూళ్లలో అవినీతికి పాల్పడ్డ ముగ్గురు మున్సిపల్ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గద్వాల మున్సిపాలిటీలో మున్సిపల్‌షాపుల అద్దెలకు సంబంధించి వసూలు చేసిన రూ.11.28 లక్షలు సంబంధిత అధికారులు మున్సిపల్ ఖాతాలో జమ చేయకపోవడాన్ని తీవ్ర తప్పిదంగా పరిగణిస్తూ కలెక్టర్ చర్యలు చేపట్టారు.
ఈ వ్యవహారంలో రెవెన్యూ ఆఫీసర్ రాజేశ్ కుమార్, సీనియర్‌అసిస్టెంట్, ఇన్‌చార్జ్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజవర్ధన్, జూనియర్ అసిస్టెంట్, ఇన్ చార్జ్ షరాఫ్ రాజవర్ధన్ నాయుడులను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు అడిషనల్ కలెక్టర్ నర్సింగరావును విచారణ అధికారిగా నియమించారు. సంబంధిత రశీదు పుస్తకాలు, రికార్డుల వివరాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.