Reading Time: < 1 minute

గోల్డ్ ట్రేడింగ్ పేరుతో రూ.5 కోట్లు మోసం.. జగిత్యాల జిల్లా పోలీసుల అదుపులో నిందితులు

Caption of Image.

జగిత్యాల టౌన్, వెలుగు : గోల్డ్ ట్రేడింగ్ పేరుతో పలువురిని మోసం చేసి రూ. 5 కోట్లు వసూలు చేసిన వ్యక్తిని జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను జగిత్యాల టౌన్ సీఐ కరుణాకర్ గురువారం వెల్లడించారు. జగిత్యాల పట్టణానికి చెందిన బెజ్జంకి అనిల్ కుమార్ కు కొన్ని రోజుల కింద జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామానికి మానాల మారుతి పరిచయం అయ్యాడు. 

ఆస్పెక్ట్ ట్రేడర్ అన్ యాప్ లో బంగారంపై ట్రేడింగ్ చేస్తే ప్రతి రోజూ ఒక శాతం లాభం చొప్పున 100 రోజుల్లో పెట్టుబడి తిరిగి వస్తుందని, తర్వాతి 100 రోజుల్లో ఆదాయం రెట్టింపు అవుతుందని నమ్మించాడు. మరికొందరిని సైతం ఇన్వెస్టర్లుగా చేర్పిస్తే రెఫరల్ కమిషన్లు సైతం వస్తాయని చెప్పాడు. నిజమేనని నమ్మిన అనిల్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో పాటు మరికొందరు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాడు. 

దీంతో మారుతి తెనాలికి చెందిన కన్నెగంటి జనార్దన్, గుంటూరుకు చెందిన మోహన్, నాగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తులతో కలిసి యాప్ తయారు చేయించాడు. తర్వాత అనిల్ కుమార్ తో పాటు మరికొందరు పెట్టుబడుల రూపంలో యాప్ రూ. 5 కోట్లు పెట్టారు. 

కొన్ని రోజుల తర్వాత యాప్ పనిచేయకపోవడంతో మారుతి ప్రశ్నించగా.. స్పందించలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన అనిల్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు మారుతిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. మిగతా వారు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.