
దేశీయ పెట్రోలియం రంగంలో దిగ్గజ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న తమ 43వేల పైచిలుకు పెట్రోల్ బంకుల నెట్‌వర్క్ ద్వారా స్వంత బ్రాండ్‌తో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అమ్మేందుకు ప్లాన్ చేస్తోంది. నాన్ ఫ్యూయెల్ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు.. కస్టమర్లకు మరింత మెరుగైన విలువైన ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా ఈ సరికొత్త వ్యూహానికి ప్లాన్ చేసింది.
దీనికోసం ఇండియన్ ఆయిల్ సంస్థ ఒక అగ్రిగేటర్-నేతృత్వంలోని రెవెన్యూ షేరింగ్ మోడల్‌ను ప్రతిపాదిస్తోంది. అయితే వాటర్ బాటిల్ బ్రాండ్ మాత్రం పూర్తిగా ఇండియన్ ఆయిల్ ఆధీనంలోనే ఉంటుంది. తయారీ, క్వాలిటీ అస్యూరెన్స్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్, మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రక్రియ వంటి ఎండ్-టు-ఎండ్ బాధ్యతలను సెలెక్ట్ చేసిన అగ్రిగేటర్లు చూసుకుంటాయి. దీనికోసం అర్హత గల సంస్థల నుండి ఇండియన్ ఆయిల్ ‘ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ ఆహ్వానించింది.
ఈ వాటర్ బాటిళ్లను తొలి దశలో హైవేలపై ఉన్న రిటైల్ అవుట్లెట్ల ద్వారా సేల్ చేయటం స్టార్ట్ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 43వేల 603 పెట్రోల్ బంకుల్లో దాదాపు సగం అంటే 21వేల 435 హైవే బంకులు ఉన్నాయి. ప్రయాణాల్లో తాగునీటి డిమాండ్ ఎక్కువగా ఉండే హైవేలకే తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాత నగరాలు, టౌన్స్ లోని బంకులకు దీనిని విస్తరిస్తారు. ప్రాథమికంగా 250 మి.లీ, 500 మి.లీ, లీటర్ పెట్ బాటిళ్లను అమ్మనుంది ఇండియన్ ఆయిల్. భవిష్యత్తులో ప్రీమియం వాటర్, మినరల్ వాటర్, ఆల్కలైన్ వాటర్ వంటి విభిన్న రకాలను నీళ్లను తీసుకురావాలని చూస్తోంది కంపెనీ.
ALSO READ : AI భద్రతపై వైట్‌హౌస్ కీలక ఒప్పందం
ఇండియన్ ఆయిల్ ప్రస్తుతం ఇంధనేతర వ్యాపారం ద్వారా వచ్చే రూ.200 కోట్ల ఆదాయాన్ని రూ.760 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే రూ.11వేల కోట్లకు పైగా జీఎంవీ సాధించాలని భావిస్తోంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలు, పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో ఈ నిర్ణయం ఎంతో కీలకమని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం ఐఓసీ నెట్‌వర్క్‌లో రోజువారీగా 3.2 కోట్ల మంది కస్టమర్లు సేవలు పొందుతున్నారు. ఇప్పటికే పలు ప్రముఖ బ్రాండ్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఇండియన్ ఆయిల్.. ఇప్పుడు ప్యాకేజ్డ్ వాటర్ మార్కెట్లోకి అడుగుపెట్టి భారీ లాభాలను ఆర్జించేందుకు సిద్ధం అవుతోంది.