Reading Time: 2 minutes
Brs Mlc Tickets Bc Candidates Telangana Graduate Mlc Polls

Off The Record : తెలంగాణలో మరో ఎన్నికల సందడి మొదలైంది. రెండు పట్టభద్రుల స్థానాలకు ఓట్ల నమోదు ప్రక్రియ మొదలైంది. నల్గొండ- వరంగల్- ఖమ్మంతోపాటు మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మొదట్లో జరిగే ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి అభ్యర్థుల్ని ప్రకటించేసింది కూడా. అదే ఇప్పుడు ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌లో చర్చకు కారణమైంది. అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్‌ అభ్యర్థులు ఇద్దరూ ఓసీలు కావడమే. ఆ పాయింట్‌నే ఎత్తి చూపుతూ విమర్శల వర్షం కురిపిస్తోంది బీఆర్‌ఎస్‌. సామాజిక న్యాయం గురించి పదేపదే మాట్లాడే కాంగ్రెస్ పార్టీ రెండు ఎమ్మెల్సీ సీట్లు ఓసీలకే ఇచ్చిందంటూ వరుస ప్రెస్ మీట్స్‌పెట్టి విమర్శిస్తున్నారు గులాబీ లీడర్స్‌. హస్తం పార్టీకి బీసీల మీద ప్రేమ లేదని, అందుకే రెండు టికెట్లూ ఓసీలకే ఇచ్చిందంటూ మండిపడుతున్నారు. కొందరు గులాబీ నేతలైతే… ఒక అడుగు ముందుకేసి తమ పార్టీ ఒక టిక్కెట్‌ని కచ్చితంగా బీసీలకు ఇస్తుందంటూ ముందస్తుగా చెప్పేస్తున్నారు. ఇలా బీఆర్‌ఎస్‌ ఒక స్థానాన్ని బీసీలకు ఇస్తుందంటూ ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది. ఇప్పుడిక కాంగ్రెస్ రెండు సీట్లకు ఓసీలనే ప్రకటించాక బీఆర్ఎస్ బీసీ నేతలు వాయిస్‌ని మరింతగా పెంచారు.

దీంతో…ప్రతిపక్ష ఓసీ నేతల్లో అభ్యర్థిత్వానికి సంబంధించిన కంగారు మొదలైందట. ముఖ్యంగా నల్గొండ- ఖమ్మం- వరంగల్ స్థానాన్ని ఓసీలకే ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ డిసైడైనట్టు తెలుస్తోంది. గతంలో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థికే ఈసారి కూడా ఇవ్వవవచ్చని అంటున్నారు. ఇక బీసీకు ఇవ్వాలనుకుంటున్న టిక్కెట్‌ మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ ఎమ్మెల్సీ సీటేనన్నది పార్టీ టాక్‌. దీంతో…ఆ పరిధిలో ఉన్న ఓసీ నేతలంతా ఇక తమకు టికెట్ రాదని డిసైడ్ అయి కామ్‌గా ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఈ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. ఎమ్మెల్యేలుగా ఓడిపోయినా తమకు ఎమ్మెల్సీలుగా అవకాశం వస్తుందేమో అని ఎదురు చూశారు. వీరితోపాటు కొందరు ఓ పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడ బీఆర్ఎస్ టిక్కెట్‌ ఆశించారు. కానీ… బీసీకి కేటాయిస్తారన్న ప్రచారంతో…వాళ్ళంతా ఆశలు వదిలేసుకున్నట్టు చెబుతున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాతనే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని బీఆర్ఎస్ అధిష్టానం ఇంటర్నల్ గా చెప్పేసిందట. దాంతో… చివరి నిమిషంలో ఏమైనా జరగవచ్చని, కాంగ్రెస్ లాగే బీఆర్‌ఎస్‌ కూడా రెండు సీట్లు ఓసీలకే కేటాయించినా ఆశ్చర్యం లేదన్న వాదన సైతం ఉంది. అందుకే… టికెట్ ఇవ్వాలని అనుకుంటే తమ పేర్లు కచ్చితంగా పరిశీలించాలని అధిష్టానం నోటీసులో ఉంచామంటున్నారు కొందరు గులాబీ ఓసీ లీడర్స్‌.