Reading Time: 2 minutes
Vijayawada Mayor Election 2026 Ysrcp Strategy Tdp Jana Sena

Off The Record: విజయవాడ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుని సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తోంది అధికార కూటమి. ఇదే సమయంలో ఆ సీటు కోసం భాగస్వామ్య పక్షాలు టిడిపి జనసేన మధ్య పోరు పీక్స్‌లో ఉంది. 2021లో వైసీపీ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్‌ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది. మొత్తం 64 డివిజన్స్‌కుగాను 49 చోట్ల గెలిచింది వైసీపీ. అంతకు ముందు టిడిపి ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేత మేయర్‌గా ఉన్నారు. అయితే… ఈసారి కూటమికి గట్టి పోటీ ఇవ్వాలన్న లక్ష్యంతో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఆ క్రమంలోనే అభ్యర్థి ఎంపికపై కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటోందట. గతంలోలా కాకుండా… ఈసారి మేయర్ స్థానానికి ప్రత్యక్ష ఎన్నిక జరగబోతోంది. అందుకే కూటమిలో కూడా సీటు పోటీ ఎక్కువైందని అంటున్నారు. ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్ తమ కుటుంబ సభ్యులను మేయర్ సీట్లో కూర్చోబెట్టాలని తహతహలాడుతున్నారు. ఇక కార్పొరేషన్‌ పరిధిలో దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన మాజీ కార్పొరేటర్లు ఎంపీ సాయంతో పావులు కదుపుతూ ఒక్క ఛాన్స్‌ అంటున్నారు. అటు జనసేన కూడా ఎన్టీఆర్ జిల్లాలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి మేయర్‌ సీటు మాకే కావాలని పట్టుబడుతున్న పరిస్థితి. నేతల మధ్య పోటీ పెరిగిపోవడం… ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉండటంతో… సోషల్ మీడియాలో కూడా దీని గురించి రకరకాల చర్చలు నడుస్తున్నాయి.

ఈ పరిణామాలతో అప్రమత్తమైన వైసీపీ.. కూటమి అభ్యర్థి ఎవరో ఖరారు అయ్యే వరకు… తమ అభ్యర్థిని ప్రకటించకుండా గుంభనంగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చిందట. దీంతోపాటు మేయర్ సీటు ఎవరికి రిజర్వ్‌ అవుతుందన్న క్లారిటీ కూడా ఇంకా రాలేదు. అధికార పార్టీలో మాదిరిగానే.. వైసీపీ నుంచి కూడా మేయర్ అభ్యర్థిగా పోటీ చేయటానికి చాలా మందే క్యూలో ఉన్నారు. ఆ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నా….. ఫ్యాన్‌ పెద్దలు ఎక్కడా రియాక్ట్‌ అవడం లేదట. ఎందుకంటే… ఇప్పుడే తొందరపడటం వల్ల సమస్యలు వస్తాయని అనుకుంటున్నారట. లిస్టులో ఎవరెవరు ఉన్నారో తెలిసిపోతే…వారికి కూటమి నుంచి చిక్కులు వచ్చే ప్రమాదం ఉందన్నది వైసీపీ అంచనాగా చెప్పుకుంటున్నారు. దీంతోపాటు మేయర్ అభ్యర్థిగా పోటీ చేసే వారికి కచ్చితంగా ఆర్థిక బలంగా ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థి ఎవరో ముందుగా తెలిసిపోతే….కూటమి ప్రభుత్వం వారి ఆర్థిక మూలలను టార్గెట్‌ చేస్తుందన్న భయం కూడా ఉందట. దీంతో… తమ పార్టీ తరపున మేయర్‌ అభ్యర్థిగా పోటీ చేసే ఆసక్తి ఉన్నవాళ్ళ పేర్లు తెలుసుకుంటున్నారు తప్ప…తుది నిర్ణయాన్ని బయటికి చెప్పడం లేదని అంటున్నారు. ఎవరు అడిగినా… ముందు రిజర్వేషన్లు ఖరారు కానివ్వండన్నదే వైసీపీ సమాధానం. ముందు కూటమిని డిసైడ్‌ చేయనివ్వండి. తర్వాత నిర్ణయం తీసుకుంటామని అంటున్నారట. ప్రస్తుతానికి బలమైన అభ్యర్థుల కోసం ఫోకస్ పెట్టామని చెబుతున్నారు. వైసీపీ ఆడుతున్న ఈ మైండ్ గేమ్ ఎంతవరకు ఫలితం ఇస్తుందో చూడాలి మరి.