Reading Time: 2 minutes
No Upi Day October 2 2026 Mdr 0 4 Percent Upi Charges

UPI Charges: అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సెలవు రోజున షాపింగ్‌కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే బయల్దేరే ముందు మీ జేబులో కచ్చితంగా కొంత క్యాష్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే, ఆ రోజున దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది వ్యాపారులు ‘నో యూపీఐ డే’ (No UPI Day) పాటించబోతున్నారు. ముంబై నుంచి ఢిల్లీ వరకు చాలా మంది దుకాణదారులు కస్టమర్ల నుంచి ఎలాంటి డిజిటల్ పేమెంట్లు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. దుకాణాల వద్ద ఉండే క్యూఆర్ (QR) కోడ్ స్కానర్లను నల్ల గుడ్డలతో కప్పి ఉంచుతారు, సౌండ్ బాక్సులు కూడా ఆ రోజంతా మూగబోనున్నాయి. అక్టోబరు 15 నుంచి అమల్లోకి రానున్న ఎండీఆర్ (MDR) నిబంధనలకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ వివాదానికి ప్రధాన కారణం ప్రభుత్వం తీసుకురానున్న ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) రుసుము. అక్టోబరు 15 నుంచి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలపై 0.40 శాతం ఎండీఆర్ ఛార్జీ విధించాలని నిర్ణయించారు. ఫెడరేషన్ ఆఫ్ రిటైల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (FRTWA) వంటి అనేక వ్యాపార సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ ఛార్జీల వల్ల తమ లాభాలు పూర్తిగా ఆవిరైపోతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు 0.40 శాతంతో మొదలైన ఈ పన్ను రేపు 1 శాతానికి పెరిగినా ఆశ్చర్యం లేదని వ్యాపారులు వాపోతున్నారు. దసరా, దీపావళి లాంటి పండుగల సీజన్‌లో ఇలాంటి అదనపు భారం పడితే వ్యాపారులు దివాళా తీయాల్సి వస్తుందని భయపడుతున్నారు. అక్టోబరు 2న తమ షాపులో ఎలాంటి యూపీఐ పేమెంట్లు తీసుకోమని, కేవలం నగదు లేదా కార్డుల ద్వారా మాత్రమే చెల్లింపులను అనుమతిస్తామని స్పష్టం చేశారు.

ఈ ఛార్జీలపై వస్తున్న అభ్యంతరం ఏంటి?

సాధారణంగా రిటైల్ వ్యాపారంలో లాభాల మార్జిన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో రూ.2,000 దాటిన ప్రతీ పేమెంట్‌పై 0.4% ఛార్జీ పడితే వారిపై కోలుకోలేని ఆర్థిక భారం పడుతుంది. ఉదాహరణకు, ఒక కస్టమర్ రూ.10,000 విలువైన సామాన్లు కొని యూపీఐ చేస్తే, వ్యాపారి ఖాతా నుంచి నేరుగా రూ.40 కట్ అవుతాయి. దసరా, దీపావళి సీజన్లలో ఎలక్ట్రానిక్స్, బట్టలు వంటి పెద్ద కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి ప్రతీ లావాదేవీ రూ.2,000 దాటుతుందని, ఇది తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (RAI) ఆందోళన చెందుతోంది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.