
లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు భారత సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ‘మూడు పాని’ చిత్రంలోని ప్రసిద్ధ ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ పాట కాపీరైట్ వివాదానికి సంబంధించి దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ అప్పీల్‌ను కొట్టివేసింది.
ఈ కేసును విచారించిన జస్టిస్ జె.బి. పర్దివాలా మరియు జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పాటల కాపీరైట్ హక్కులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక సినిమాలో పాటల యజమాన్య హక్కులకు సంబంధించి ఇళయరాజాకు కేవలం ఆయన స్వరపరిచిన సంగీతంపై మాత్రమే కాపీరైట్ హక్కులు ఉంటాయని న్యాయస్థానం పునరుద్ఘాటించింది. పాటలో భాగమైన సాహిత్యంపై గేయ రచయితకు, అలాగే సౌండ్ రికార్డింగ్ పై సంబంధిత ప్రొడ్యూసర్ లేదా రికార్డింగ్ లేబుల్‌కు హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు వివరించింది. ఆయా విభాగాలపై ఇళయరాజాకు ఎలాంటి కాపీరైట్ హక్కులు ఉండవని స్పష్టం చేస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన మునుపటి తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఎన్ ఇనియ పొన్ నిలవే’ పాట కాపీరైట్ వివాదానికి సంబంధించి మ్యూజిక్ లేబుల్ ‘సరిగమ’కు భారీ ఊరట లభించింది.