Reading Time: < 1 minute
Mayuri Film Distributors Re Entry Ramoji Group Thella Kagitham Release

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పంపిణీ రంగానికి సరికొత్త అర్థం నేర్పిన దిగ్గజ సంస్థ ‘మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్’ (రామోజీ గ్రూప్ సంస్థ). కొన్ని సంవత్సరాలుగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో స్తబ్దత పాటించిన ఈ ప్రతిష్టాత్మక సంస్థ, మళ్లీ థియేటర్ల వ్యవస్థలోకి రీ-ఎంట్రీ ఇస్తుండటం ఇప్పుడు టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సినిమా నిర్మాణం, పంపిణీ రంగాల్లో ఒకప్పుడు తిరుగులేని ముద్ర వేసిన రామోజీ గ్రూప్.. ఇన్నాళ్ల విరామం అనంతరం తన పునరాగమనం కోసం భారీ స్టార్ల సినిమాలను ఎంచుకోకుండా, కంటెంట్ బేస్డ్ సినిమా అయిన ‘తెల్ల కాగితంవైపు మొగ్గు చూపడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ చిత్రాన్ని అత్యంత గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మయూరి సంస్థ సిద్ధమైంది.

ఇక సాధారణంగా పెద్ద బడ్జెట్ చిత్రాలకే ప్రీమియర్ షోల నిర్ణయం కత్తిమీద సాములాంటిది. చిన్న తేడా వచ్చినా టాక్ దెబ్బతింటుందనే భయం ఉంటుంది. అలాంటిది అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు, రిలీజ్‌కు ముందే ‘పెయిడ్ ప్రీమియర్స్’ వేస్తుండటం, దానికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ చేయడం ట్రేడ్ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. సినిమాలోని కంటెంట్‌పై తిరుగులేని నమ్మకం ఉంటే తప్ప ఇలాంటి ముందడుగు వేయడం అసాధ్యం. అగ్ర పంపిణీ సంస్థ అండదండలు తోడవడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. విశ్వసనీయతకు మారుపేరైన మయూరి సంస్థ పునరాగమనం థియేటర్ వర్గాలకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుండగా, అక్టోబర్ 2న విడుదల కానున్న ‘తెల్ల కాగితం’ వెండితెరపై ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతోందో చూడాలి.