
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్‌కు నా గురించి.. కాంగ్రెస్ పార్టీ గురించి తెలియదని.. ఫామ్‌హౌస్‌లో పడుకున్న వాళ్ల అయ్య కేసీఆర్‌ను అడుగితే చెప్తాడన్నారు. ఆనాడు గజ్వేల్ గడీని నేలమట్టం చేస్తామని చెప్పినం.. చేసి చూపించాం.. ఈ సారి సిరిసిల్ల గడీల మీద గురి పెడతాం.. ఈ గడీని నేలమట్టం చేస్తామని బీఆర్ఎస్కు సవాల్ విసిరారు. బుధవారం (సెప్టెంబర్ 30) సీఎం రేవంత్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు.
ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. 2009లో కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్‌ను అమెరికా నుంచి దింపి సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారన్నారు. ఆ ఎన్నికల్లో కేటీఆర్ 172 ఓట్ల తేడాతో చావు తప్పి కన్ను లొట్టపోటయినట్లు గెలిచారని ఎద్దేవా చేశారు.
2009 నుంచి ఆరుసార్లు జరిగిన ఎన్నికల్లో సిరిసిల్ల ప్రజలు కేటీఆర్‌ను గెలిపించారు. కానీ బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కేటీఆర్ నేతన్నల ఆత్మహత్యలను ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించారు. గల్ఫ్‌కు వలసపోతున్న కార్మికులను ఎందుకు ఆపలేకపోయారని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నల కుటుంబాలను ఆదుకోవడానికి అణాపైసా సాయం చేయలేదన్నారు.
►ALSO READ | ఈసారి సిరిసిల్ల మీద గురి పెడదాం.. ఈ గడీని నేలమట్టం చేద్దాం: సీఎం రేవంత్
కేసీఆర్ ఫ్యామిలీ ఒక్కరోజు కూడా మీ కుటుంబాల గురించి ఆలోచించలేదని అన్నారు. సిరిసిల్ల ప్రజల వేలాది ఓట్లను పచ్చ నోట్లుగా మార్చుకున్నారని ఆరోపించారు. సిరిసిల్లను బీఆర్ఎస్ ఉరిసిల్లగా మార్చిందని.. సమస్యలకు కేరాఫ్‌గా సిరిసిల్లను మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదేండ్లలో వేల కోట్ల ఆస్తులు సంపాదించి.. వందల ఎకరాల ఫాంహౌస్ లు నిర్మించుకున్నారని ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమం, సిరిసిల్ల ప్రజల ఓట్లను కేసీఆర్ ఫ్యామిలీ సొమ్ముగా మార్చుకుందన్నారు. వేల కోట్లు సంపాదించి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని విమర్శించారు.