Reading Time: < 1 minute
Ankush Panghal Gold Asian Games 2026

2026 ఆసియా క్రీడల్లో పురుషుల బాక్సింగ్ విభాగంలో భారతదేశానికి మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని అంకుశ్ పంఘల్ సాధించి చరిత్ర సృష్టించాడు. హర్యానాకు చెందిన 21 ఏళ్ల యువ బాక్సర్ అంకుశ్ పంఘల్, పురుషుల 80 కేజీల ఫైనల్ పోరులో దక్షిణ కొరియాకు చెందిన మిన్సోంగ్ కిమ్‌తో తలపడి ఏకపక్ష విజయం సాధించాడు. ఈ తుది పోరులో అంకుశ్ 5-0 తేడాతో ఘన విజయం సాధించి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

మొదటి రౌండ్‌లో 4-1 తేడాతో పైచేయి సాధించిన అతను, ఆ తర్వాత రెండు రౌండ్‌లలోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి 5-0 ,  4-1 తేడాతో ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. ఈ ఆసియా క్రీడలకు ముందు అంకుశ్ తన అరంగేట్రం కామన్వెల్త్ క్రీడల్లోనూ స్వర్ణ పతకం సాధించడం విశేషం. ఈ ఆసియా క్రీడలలో పురుషుల బాక్సింగ్ విభాగంలో అంకుశ్ స్వర్ణ పతకానికి ముందు భారత్ రెండు కాంస్య పతకాలను మాత్రమే సాధించగలిగింది.

కాగా.. ఇదే రోజు మహిళల బాక్సింగ్ విభాగంలోనూ భారత్‌కు అద్భుతమైన విజయాలు దక్కాయి. మహిళల 75 కేజీల విభాగంలో లవ్లీనా , 65 కేజీల విభాగంలో పర్వీన్ హూడా స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. ఈ విజయాలతో లవ్లీనా , పర్వీన్ ఇద్దరూ మహిళల బాక్సింగ్‌లో ఆసియా క్రీడల స్వర్ణం సాధించిన దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ సరసన స్థానం సంపాదించుకున్నారు.

తన పుట్టినరోజు సందర్భంగా బరిలోకి దిగిన లవ్లీనా చైనాకు చెందిన జియి బావోపై 5-0 తేడాతో విజయం సాధించి, గత ఎడిషన్‌లో తను గెలుచుకున్న రజత పతకాన్ని స్వర్ణంగా అప్‌గ్రేడ్ చేసుకుంది. అలాగే పర్వీన్ హూడా పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన చెన్ నియెన్-చిన్‌పై 3-2 తేడాతో అరుదైన విజయం సాధించి తొలిసారిగా ఆసియా క్రీడల స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ఈ విజయాల ద్వారా భారతదేశం బాక్సింగ్ రంగంలో తన సత్తాను మరోసారి అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పింది.