Reading Time: 2 minutes
Shubman Gill: డబుల్ సెంచరీని పక్కనపెట్టండి.. గిల్‌లో గంభీర్ చూసింది ఇదే

Shubman Gill: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా 406 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి సంచలన విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అజేయంగా 223 పరుగులు సాధించి క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కేవలం గిల్ బ్యాటింగ్ గురించే కాకుండా, అతడి కెప్టెన్సీలోని ప్రత్యేక నైపుణ్యాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గిల్ మైదానంలో బౌలర్లను అర్థం చేసుకునే తీరు, వారిపై నూతనోత్సాహం నింపుతున్న విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని గంభీర్ పేర్కొన్నారు.

బౌలర్ల కెప్టెన్‌గా మారుతున్న శుభ్‌మన్ గిల్

నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గిల్ ఆటతీరులో అద్భుతమైన పరిపక్వత కనిపిస్తోందని కోచ్ అభిప్రాయపడ్డారు. కేవలం వైట్ బాల్ క్రికెట్ మాత్రమే కాకుండా టెస్టుల్లోనూ అతడు తన లీడర్‌షిప్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకుంటున్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లందరి నుంచి గిల్‌కు పూర్తి గౌరవం లభిస్తోందని, టీమ్ మెంబర్స్ అంతా అతడు చెప్పేది శ్రద్ధగా వింటారని గంభీర్ వెల్లడించారు. మ్యాచ్ సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో బౌలర్లు ఎంతటి ఒత్తిడి ఎదుర్కొంటారో గ్రహించి వారికి తగిన భరోసా ఇస్తున్నాడని, అందుకే గిల్ క్రమంగా అసలైన బౌలర్స్ కెప్టెన్‎గా ఎదుగుతున్నాడని ప్రశంసించారు.

యంగ్ బౌలర్లకు ప్రెషర్ మ్యాచ్‌లలోనే అనుభవం

ఈ మ్యాచ్‌లో యువ పేసర్లు గుర్నూర్ బ్రార్, అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆకిబ్ నబి భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ, కోచ్ గంభీర్ వారిని వెనకేసుకొచ్చారు. 2027 వన్డే ప్రపంచ కప్ టోర్నీని దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లను కేవలం సులువైన మ్యాచ్‌లలో మాత్రమే ఆడించడం సరైన పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు. ఒత్తిడితో కూడిన కఠినమైన మ్యాచ్‌లలో ఆడిస్తేనే భవిష్యత్తు కోసం అవసరమైన అనుభవం వస్తుందని వివరించారు. గున్నూర్, ఆకిబ్ గణాంకాలు ఖరీదైనప్పటికీ, క్లిష్టమైన సమయాల్లో వారు పడిన శ్రమ భవిష్యత్తులో జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని బలమైన నమ్మకం వ్యక్తం చేశారు.

గౌహతి పిచ్‌పై కోచ్ గంభీర్ అసంతృప్తి

ఈ పోరులో ఇటు భారత్ అటు వెస్టిండీస్ జట్లు రెండు వైపులా 400లకు పైగా పరుగులు సాధించడం విశేషం. అయితే మ్యాచ్ ముగిశాక గౌహతి పిచ్ స్వభావంపై గంభీర్ కొద్దిగా ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాట్లు, బాల్ మధ్య పోటీ మరింత బ్యాలెన్సింగ్ గా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం బౌలర్ ఇచ్చిన పరుగులు లేదా తీసిన వికెట్ల సంఖ్య ఆధారంగానే వారి ప్రదర్శనను బేరీజు వేయకూడదని, కఠినమైన పరిస్థితుల్లో వారు తమ ప్లాన్లను ఎంత సమర్థంగా అమలు చేశారనేదే ముఖ్యమని ఆయన విశ్లేషించారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ రెండు సున్నా తేడాతో ఆధిక్యంలో దూసుకెళ్తోంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..