
India vs Pakistan Final Rain Threat: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 3న నిస్షిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం 10 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది. మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షించవచ్చు. సోనీ లివ్ యాప్, వెబ్‌సైట్ ద్వారా కూడా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. దాయాదుల సమరం.. అందులోనూ గోల్డ్ మెడల్ పోరు కావడంతో.. ఇండో-పాక్ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఫైనల్‌కు వర్షం ముప్పు ఉండటంతో.. మ్యాచ్ పూర్తిగా రద్దయితే విజేతను ఎలా నిర్ణయిస్తారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఫైనల్ రద్దయితే:
భారత్-పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. అంటే భారత్, పాకిస్థాన్ జట్లకు బంగారు పతకాలు దక్కుతాయి. మ్యాచ్ రద్దయిన సందర్భంలో టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా విజేతను నిర్ణయించే నిబంధన 2026 ఆసియా క్రీడల్లో వర్తించదు. 2023 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో నిబంధనలు మరోలా ఉన్నాయి. భారత్-అఫ్గానిస్థాన్ పురుషుల క్రికెట్ ఫైనల్ వర్షం కారణంగా రద్దవడంతో.. మెరుగైన టీ20 ర్యాంకింగ్ ఆధారంగా భారత్‌కు స్వర్ణ పతకం దక్కింది. అయితే 2026 ఆసియా క్రీడల నిబంధనల ప్రకారం.. ఫైనల్‌లో ఫలితం రాకపోతే రెండు జట్లూ సంయుక్తంగా ఛాంపియన్లుగా నిలుస్తాయి.
సెమీస్‌లో భారత్ జోరు:
శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 124 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 21 బంతుల్లో 38 పరుగులతో శుభారంభం అందించగా.. ఇషాన్ కిషన్ అజేయంగా 80 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్ అందించాడు. అనంతరం భారత బౌలర్లు శ్రీలంక బ్యాటర్లను క్రీజులో కుదురుకోనీయలేదు. లంక 19.5 ఓవర్లలో కేవలం 45 పరుగులకే ఆలౌటైంది. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ తలో రెండు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.
బంగ్లాదేశ్‌పై పాక్ విజయం:
పాకిస్థాన్ సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 111/7 పరుగులు చేయగా.. పాకిస్థాన్ 9 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. అబ్దుల్ సమద్, హసన్ నవాజ్ కీలక భాగస్వామ్యంతో పాకిస్థాన్‌ను ఫైనల్‌కు చేర్చారు.
తొలిసారి భారత్-పాక్ ఫైనల్:
పురుషుల క్రికెట్‌లో ఆసియా క్రీడల వేదికగా భారత్, పాకిస్థాన్ జట్లు తొలిసారి తలపడబోతున్నాయి. 2023 హాంగ్‌జౌ క్రీడల తర్వాత భారత్ పురుషుల విభాగంలో ఐదు మ్యాచ్‌లు ఆడినా.. పాకిస్థాన్‌తో మాత్రం తలపడలేదు. ఇప్పుడు నేరుగా ఫైనల్‌లో ఈ రెండు జట్లు ముఖాముఖి కానున్నాయి.
టీమిండియాదే పైచేయి:
ఇటీవల టీ20ల్లో భారత్-పాకిస్థాన్ పోరులో టీమిండియాదే పైచేయి. ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించింది. గత టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ 61 పరుగుల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 77 పరుగులతో రాణించగా.. భారత బౌలర్లు పాకిస్థాన్‌ను 114 పరుగులకే పరిమితం చేశారు. నిస్షిన్‌లో ఫైనల్ రోజున వర్షం పడే అవకాశం ఉండటంతో మ్యాచ్ నిర్వహణపై ఆసక్తి నెలకొంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే భారత్, పాకిస్థాన్ మధ్య ఉత్కంఠభరితమైన ఫైనల్ జరగనుంది.