
అమెరికాలో స్థిరపడిన తెలుగమ్మాయి వారాహి మల్లిపాముల కథను అందిస్తూ నిర్మించిన చిత్రం ‘ఇంప్యూర్’. నిశాంతి ఇవని దర్శకత్వం వహించారు. వారాహితో పాటు యషా ముత్తులూరి, సాయి కృష్ణ లీడ్ రోల్స్‌లో నటించారు. అక్టోబర్ 2న సినిమా థియేటర్స్‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వారాహి మాట్లాడుతూ ‘కాకినాడలో పుట్టిన నేను పెన్సిల్వేనియాలో పెరిగా. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉంటున్నా. టెక్ రంగంలో పనిస్తూనే ఎన్నో ఏళ్లుగా సినిమా ప్రయత్నాలు చేస్తున్నా. ఉమెన్ సెంట్రిక్ స్టోరీ కావడంతో నా స్క్రిప్ట్‌తో సినిమా తీసేందుకు నిర్మాతలు సందేహించారు.
అయితే ‘మా ఇంటి బంగారం’ విజయంతో సమంత, నందిని రెడ్డి ఆ అపోహలను తొలగించారు. ఆ స్ఫూర్తితో నేనే ఈ చిత్రాన్ని నిర్మించి, రిలీజ్ చేస్తున్నా. మోడ్రన్ రిలేషన్‌షిప్స్ డ్రామా ఇది. ఒక మహిళ కన్య కాదని ఆమె అత్తమామలకు తెలియడంతో ఆ పెళ్లిని రద్దు చేసే కథాంశంతో దీన్ని తెరకెక్కించాం. అంతర్జాతీయ ర్యాపర్ రాజా కుమారి పాటలు కంపోజ్ చేశారు. డీవోపీ జ్ఞానశేఖర్ వి.ఎస్. మా సినిమా స్థాయిని పెంచారు. స్త్రీ, పురుషుల సమస్యలపై ఒక కొత్త కోణాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది’ అని చెప్పారు.