
హైదరాబాద్, వెలుగు: అడవులను కాపాడితేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుందని పీసీసీఎఫ్ రత్నాకర్ జౌహరి అన్నారు. అడవులు, వన్యప్రాణులను రక్షించేందుకు అటవీ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేసే బీట్ ఆఫీసర్లు తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని రాష్ట్ర అటవీ అకాడమీలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల ఐటీపీ 39వ బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమం బుధవారం జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరైన రత్నాకర్ జౌహరి శిక్షణార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం టీజీఎఫ్‌డీసీ ఎండీ సునీతా ఎం. భగవత్‌తో కలిసి శిక్షణార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ జౌహరి మాట్లాడుతూ.. ప్రకృతితో కలిసి పనిచేసే అరుదైన అవకాశం అటవీ శాఖ సిబ్బందికే దక్కుతుందని పేర్కొన్నారు.