
మనం రోజూ తీసుకునే టీ, కాఫీలు, స్వీట్లు, కూల్‌డ్రింక్స్ ద్వారా శరీరంలో చక్కెర ప్రమాణంగా పెరుగుతుంది. అయితే, చక్కెరను పూర్తిగా మానడం వల్ల శరీరంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.. కృత్రిమ పంచదారను నిరోధించడం వల్ల ఉత్సాహం పెరగడం, బరువు అదుపులోకి రావడం, ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడటం వంటి ప్రయోజనాలు ఉంటాయి. అయితే, పండ్లలో ఉండే సహజ సిద్ధమైన చక్కెరను మానడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
పండ్లలోని సహజ చక్కెరను ఆపవద్దు: కూల్‌డ్రింక్స్, స్వీట్లు, ఆహార పదార్థాలలో అదనంగా కలిపే కృత్రిమ పంచదారను తగ్గించడం చాలా మంచిది. అయితే, పండ్లలో ఉండే ఫ్రక్టోజ్ వంటి సహజసిద్ధమైన చక్కెరను పూర్తిగా మానడం సరైన పద్ధతి కాదు. పండ్లను పూర్తిగా మానేస్తే శరీరానికి లభించే ఫైబర్, మైక్రోన్యూట్రియెంట్లు లోపించి మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.
బరువు సులభంగా అదుపులోకి వస్తుంది: అదనంగా పంచదార కలిపిన పదార్థాలను మానడం ద్వారా రోజువారీ కేలరీల వినియోగం తగ్గుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, అధికంగా కృత్రిమ చక్కెరలు తీసుకోవడమే ఊబకాయానికి ప్రధాన కారణం. దీనిని నిరోధించడం వల్ల బరువును సులభంగా నియంత్రించవచ్చు.
నిలకడైన శక్తి లభిస్తుంది: చక్కెర ఎక్కువ ఉన్న పదార్థాలు తిన్నప్పుడు శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరితగతిన పెరిగి, అంతే వేగంగా పడిపోతాయి, దీనివల్ల నీరసం వస్తుంది. పంచదారను తగ్గించి, ధాన్యాలు, పప్పుధాన్యాలు, కూరగాయలు తీసుకోవడం వల్ల శరీరానికి రోజంతా స్థిరమైన శక్తి అందుతుంది.
జీవక్రియ మెరుగుపడుతుంది: చక్కెర వాడకాన్ని తగ్గించడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు తగ్గి, ఇన్సులిన్ సున్నితత్వం పెరుగుతుంది. ఇది మెటబాలిక్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, డయాబెటిస్, గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఎవరికి చక్కెర నియంత్రణ చాలా అవసరం? డయాబెటిస్ బాధితులు, పిసిఓడి (PCOS) సమస్య ఉన్న మహిళలు, అధిక బరువు ఉన్న పిల్లలు, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం ఉన్నవారు, గర్భిణులు చక్కెర వినియోగాన్ని ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి.
ఎంత చక్కెర తీసుకోవచ్చు? WHO నిబంధనల ప్రకారం, మనం తీసుకునే మొత్తం కేలరీలలో చక్కెర వాటా 10శాతం కంటే తక్కువగా (సుమారు 50 గ్రాములు లేదా 12 టీస్పూన్లు) ఉండాలి. దీనిని 5శాతానికి (6 టీస్పూన్లు) తగ్గించుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఆహారంలో పంచదారను పూర్తిగా మానాల్సిన అవసరం లేదు. టీ, కాఫీల్లో చక్కెర తగ్గించడం, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా సమగ్ర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.