Reading Time: 2 minutes
Anakapalli Producer Naidu Prabhas Fan Theatre Owner Journey

Anakapalli Producer Naidu: సినిమా పిచ్చి ఉండటం వేరు.. అదే సినిమాను శ్వాసగా మార్చుకుని కలలను నిజం చేసుకోవడం వేరు. సరిగ్గా ఇదే బాటలో నడిచి నేడు ఎందరో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ‘అనకాపల్లి’ చిత్ర సహ నిర్మాత నాయుడు. కేవలం ఒక సామాన్య సినీ అభిమానిగా మొదలైన ఆయన జీవిత ప్రయాణం.. నేడు థియేటర్ అధినేతగా, చిత్ర నిర్మాతగా ఎదిగిన తీరు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే రా అండ్ రస్టిక్ చిత్రాలకు టాలీవుడ్‌లో తిరుగులేని ఆదరణ లభిస్తోంది. ఇదే తరహాలో పక్కా విలేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ‘అనకాపల్లి’. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించి కీలక పాత్రలో నటిస్తూ నిర్మించిన ఈ చిత్రానికి నిర్మాత నాయుడు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్ర ప్రమోషన్ల సందర్భంగా నిర్మాత నాయుడు తన గతాన్ని గుర్తుచేసుకుంటూ పంచుకున్న మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. ‘‘నేను రెబల్ స్టార్ ప్రభాస్ గారికి వీరాభిమానిని. ప్రభాస్ ‘మిర్చి’ సినిమా విడుదలయ్యే సమయానికి నేను ఏ బ్యాక్‌గ్రౌండ్ లేని ఒక సాధారణ వ్యక్తిని. ఆ టైంలో అనకాపల్లిలో సినిమాకు వెళ్తే టికెట్ ఇవ్వలేదు. ఏదో ఒకరోజు కచ్చితంగా ఆ థియేటర్ కొనుక్కోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఆ టైంలో జీవితంలో ఏదో సాధించాలన్న బలమైన సంకల్పం, లక్ష్యంతో అడుగులు ముందుకు వేశాను. కష్టపడి పైకొచ్చి థియేటర్ ఓనర్‌గా మారాను. ఇప్పుడు నేను నిర్మించిన సినిమాను నా సొంత థియేటర్‌లోనే ప్రదర్శించుకుంటున్నాను’’ అంటూ ఆయన చెప్పిన మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఒకప్పుడు టికెట్ కోసం క్యూలైన్లలో నిలబడ్డ సామాన్య అభిమాని.. క్రమంగా ఎగ్జిబిటర్‌గా మారి థియేటర్ల యజమాని కావడం, ఆపై సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి సినిమాను నిర్మించి తన సొంత థియేటర్‌లో ప్రదర్శించుకోవడం నిజంగా అద్భుతమైన విజయం. కలలను నిజం చేసుకోవడానికి కష్టపడే తత్వానికి మించిన పెట్టుబడి మరొకటి లేదని నిర్మాత నాయుడు ప్రయాణం నిరూపిస్తోంది. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ‘అనకాపల్లి’ చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. పక్కా స్థానికతతో, రస్టిక్ యాక్షన్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాలని కోరుకుంటూనే.. ఈ స్థాయికి చేరుకున్న నిర్మాత నాయుడు సంకల్పాన్ని పలువురు సినీ ప్రియులు అభినందిస్తున్నారు.