Reading Time: 2 minutes
Probation Period Rules Can Company Fire You Without Notice

Probation Period Rules: కొత్త కొలువు లభించగానే అప్పటివరకు పడ్డ కష్టాలన్నీ తీరిపోయాయని, కెరీర్ సెట్ అయిపోయిందని సంబరపడిపోతుంటారు చాలామంది. చేతికి ఆఫర్ లెటర్ రాగానే లైఫ్ ఇక సాఫీగా సాగిపోతుందని భావించే ఉద్యోగులకు ఎదురయ్యే మొదటి పెద్ద సవాలే ‘ప్రొబేషన్ పీరియడ్’. కార్పొరేట్ కంపెనీల్లో ప్రతి ఒక్కరి నోటా వినిపించే ఈ పదం వెనుక ఉండే అసలు రూల్స్, పొంచి ఉన్న ప్రమాదాలు చాలామందికి పూర్తిగా తెలియవు. ఫలితంగా కొందరు అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది. అసలు ప్రొబేషన్ పీరియడ్ అంటే ఏమిటో తెలుసా..

సింపుల్‌గా చెప్పాలంటే ఇది కంపెనీ మీ ప్రతిభను, పనితీరును అంచనా వేసే ‘ట్రయల్ రన్’ లాంటిది. ఇంటర్వ్యూలలో ప్రతిభ చూపించి ఎంపికైనప్పటికీ.. నిజంగా ఆఫీస్ వాతావరణంలో ఎలా పనిచేస్తున్నారు? టీం మెంబర్స్‌తో మీ సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? కంపెనీ అప్పగించిన బాధ్యతలను సకాలంలో నెరవేర్చగలరా లేదా? వంటి విషయాలను హెచ్ఆర్, మేనేజ్‌మెంట్ నిశితంగా పరిశీలించే వ్యవధి ఇది. సంస్థ నిబంధనలను బట్టి ఈ కాలపరిమితి 3 నెలల నుంచి 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు.

నోటీస్ ఇవ్వకుండానే ఉద్యోగం నుంచి తీసేయవచ్చా?
కొత్తగా ఉద్యోగంలో చేరినవారిలో తలెత్తే అతిపెద్ద ఆందోళన నోటీస్ ఇవ్వకుండానే ఉద్యోగం నుంచి తీసేయవచ్చా అనేది. ప్రొబేషన్‌లో ఉన్నప్పుడు సంస్థ ఉద్యోగిని ఎప్పుడైనా తీసేయవచ్చా అంటే.. అవుననే సమాధానం వస్తుంది. అపాయింట్‌మెంట్ లెటర్‌లోని షరతులను బట్టి యాజమాన్యానికి పూర్తి అధికారాలు ఉంటాయి. ఉద్యోగి పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోయినా, కంపెనీ సంస్కృతికి అలవాటు పడకపోయినా ఉన్నట్లుండి తీసివేసే హక్కు సంస్థలకు ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి ముందస్తు నోటీస్ లేకుండానే ఉద్యోగిని తొలగించవచ్చని ఆఫర్ లెటర్‌లో స్పష్టంగా ఉంటే, తక్షణమే ఇంటికి పంపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కోర్టులు కూడా అనేక కేసుల్లో ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ప్రొబేషనరీ ఉద్యోగి అంటే పూర్తిగా పర్మనెంట్ అయినట్లు కాదు కాబట్టి, పనితీరు సరిగ్గా లేనప్పుడు సంస్థ తీసుకునే చర్యలను చట్టం కూడా సమర్థిస్తుంది.

అప్పుడు ఉద్యోగం పర్మనెంట్ అయిపోయినట్లేనా?

చాలామంది అనుకునే మరో పెద్ద పొరపాటు.. అపాయింట్‌మెంట్ లెటర్‌లో పేర్కొన్న 3 లేదా 6 నెలల గడువు ముగియగానే ఉద్యోగం ఆటోమేటిక్‌గా ఖాయమైపోయిందని భావించడం. కానీ వాస్తవానికి సంస్థ నుంచి అధికారికంగా ‘కన్ఫర్మేషన్ లెటర్’ చేతికి రానింతవరకు ఆ ఉద్యోగం పక్కా అయినట్లు కాదు. ఒకవేళ మీ పనితీరుపై యాజమాన్యానికి ఇంకా పూర్తి నమ్మకం కుదరకపోయినా లేదా మీలో మరింత మెరుగుదల అవసరమని భావించినా.. ప్రొబేషన్ వ్యవధిని మరింత పొడిగించే అధికారం కంపెనీలకు ఉంటుంది. సర్వీస్ నిబంధనలు ఇందుకు అనుమతిస్తే మరో రెండు మూడు నెలల పాటు అదే పరీక్షా కాలాన్ని కొనసాగిస్తారు.

ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

చేతికి వచ్చిన జాబ్ ఆఫర్ పట్ల ఉత్సాహం ఎంత అవసరమో, చేరే ముందు ఆఫర్ లెటర్‌లోని నిబంధనలను క్షుణ్ణంగా చదవడం అంతే ముఖ్యం. ముఖ్యంగా:

* ప్రొబేషన్ వ్యవధి ఎంత కాలం ఉంటుంది?

* ఆ సమయంలో నోటీస్ పీరియడ్ నిబంధనలు ఏమిటి?

* ఏ పరిస్థితుల్లో ఉద్యోగం తొలగించే అవకాశం ఉంది?

* శాశ్వత ఉద్యోగిగా మారడానికి కంపెనీ విధించిన లక్ష్యాలేంటి?

ఇలాంటి కీలక విషయాలను ముందే తెలుసుకుని, ప్రొబేషన్ పీరియడ్‌ను అత్యంత జాగ్రత్తగా దాటితేనే ఆ ఉద్యోగంలో నిలదొక్కుకోవడం సాధ్యమవుతుంది.