
HDFC బ్యాంక్ బాధ్యతలను కొత్త బాస్కు అప్పగించారు. HDFC బ్యాంకుకు అనూప్ బాగ్చిని మేనేజింగ్ డైరెక్టర్ (MD), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా (CEO) నియమించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
2026, అక్టోబర్ 27 నుంచి మూడేళ్ల కాలానికి HDFC మేనేజింగ్ డైరెక్టర్గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అనూప్ బాగ్చి బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఈ నియామకంతో.. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో నాయకత్వ మార్పు జరగనుంది. ప్రస్తుత ఎండీ, సీఈఓ శశిధర్ జగదీషన్ అక్టోబర్ 26, 2026న వ్యాపార కార్యకలాపాలు ముగిసే సమయానికి తన పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటారు.
ఇదిలా ఉండగా.. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 35బి కింద బాగ్చిని ఎండీ, సీఈఓగా నియమించడానికి, అలాగే ఆయనకు చెల్లించాల్సిన పారితోషికానికి RBI ఆమోదం తెలిపిందని HDFC బ్యాంక్ స్పష్టం చేసింది. ఆర్‌బిఐ ఆమోదం తరువాత.. వాటాదారుల ఆమోదంతో.. అక్టోబర్ 27 నుంచి మూడు సంవత్సరాల కాలానికి బాగ్చిని HDFC MD, CEOగా నియమించడానికి బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపింది. అక్టోబర్ 2 నుంచి అమలులోకి వచ్చేలా ఆయనను అదనపు డైరెక్టర్‌గా కూడా నియమించింది. HDFC ఎండీ, సీఈఓగా బాగ్చీ పదవీ కాలం అక్టోబర్ 26, 2029 వరకు కొనసాగుతుంది.
HDFC బ్యాంక్ వార్షిక నివేదిక (FY26) ప్రకారం.. మార్చి 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో HDFC బ్యాంక్ ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశిధర్ జగదీశన్ వార్షిక వేతనం రూ. 15.13 కోట్లు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆయన వేతనం 19 శాతం పెరిగింది.
అయితే.. HDFC బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ కైజాద్ భరుచా వార్షిక వేతనం రూ. 17.14 కోట్లు కావడం విశేషం. HDFC బ్యాంకు మొత్తంలో అత్యధిక వేతనం పొందుతున్న ఎగ్జిక్యూటివ్ భరుచానే కావడం గమనార్హం. అనూప్ బాగ్చి వార్షిక వేతనం ఈ ఇద్దరి కంటే కచ్చితంగా ఎక్కువగానే ఉంటుందనడంలో సందేహమే లేదు.