
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా 13 కోట్ల ఓట్లను తొలగించారన్న ప్రతిపక్షాల ఆరోపణలపై భారత కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. సర్ ప్రక్రియలో పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపు, అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది.
ఓటర్ల జాబితా నుంచి 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారన్న వాదన పూర్తిగా తప్పుదోవ పట్టించేదని.. ఇది కేవలం దుష్ప్రచారమని పేర్కొంది. సర్ ముసాయిదా జాబితా నుంచి తొలగించిన లేదా గుర్తించిన 13.3 కోట్ల పేర్లు చట్టబద్ధమైన నిబంధనల ప్రకారమే సవరించబడ్డాయని తెలిపింది.
ఇందులో మరణించిన, డూప్లికేట్, వలస వెళ్లిన ఓటర్లు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఒకవేళ నిజమైన అర్హులైన ఓటర్లు ఎవరైనా జాబితా నుంచి తప్పుగా తొలగించబడి ఉంటే వారి పేర్లను తిరిగి చేర్చడానికి ప్రత్యేక నమోదు డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. సర్ ప్రక్రియ పూర్తైన 20 రాష్ట్రాల్లో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని వెల్లడించింది.
బూత్ లెవల్ అధికారులే స్వయంగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించి నమోదు చేసుకుంటారని తెలిపింది. ఓటర్లు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కాగా, సర్ ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని.. ఈసీ ఏకపక్షంగా కోట్ల సంఖ్యలో ఓట్లను తొలగించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
సర్ విషయంలో ఎన్నికల సంఘంలోనే అంతర్గత విభేదాలు ఉన్నాయని.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరించారని జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేసి.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.