
కోట్ల మంది నమ్మకంతో ముడిపడి ఉన్న గోల్డ్ వ్యాపారంలో స్వచ్ఛత భయాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. భారతీయులకు బంగారం అంటే కేవలం అలంకరణ మాత్రమే కాదు.. ఎమర్జెన్సీలో ఆదుకునే ఆర్థిక భద్రత. అదే బంగారం నాణ్యతపై బయటపడుతున్న విషయాలు కంగారు పుట్టిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం BIS హాల్‌మార్కింగ్ ఫీజులను భారీగా పెంచడం వ్యాపారులను పక్కదారి పట్టేలా చేస్తోంది. ఈ పెంపు భారం చివరకు సామాన్యుల కొనుగోళ్లపై పడటమే కాకుండా.. టైర్-2, టైర్-3, టైర్-4 వంటి చిన్న నగరాల్లోని మోసగాళ్లకు, రూల్స్ పాటించని వ్యాపారులకు నకిలీ స్టాంపులు వేసేలా ప్రేరేపిస్తోంది.
ఆభరణాలపై కచ్చితమైన నాణ్యతను నిర్ధారించే హాల్‌మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేషన్(HUID) ప్రక్రియలో భాగంగా వినియోగదారులు నిర్దిష్ట రుసుము చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ప్రతి ఆభరణానికి రూ. 45గా ఉన్న హాల్‌మార్కింగ్ చార్జీలను ఏకంగా రూ.75కి పెంచింది మోడీ సర్కార్. అంటే ఒక్కసారిగా 66.67% మేర ఖర్చు పెరగడంతో మొత్తం జ్యువెలరీ రంగానికి సుమారు రూ.400 కోట్ల అదనపు భారం పడుతోంది. దీనికి తోడు జీఎస్‌టీ రూపంలో మరో రూ.80 కోట్లు కట్టాల్సి రావటంతో ఆభరణాల తయారీదారులు, వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిన్న నగరాల్లో మోసాలు..
పెరుగుతున్న ఈ ఖర్చులు, నిబంధనల భారం ఒకెత్తయితే.. దేశంలోని చిన్న నగరాలు పట్టణాల్లో వినియోగదారులకు ఉండాల్సిన అవగాహన లేమి మరో పెద్ద శాపంగా మారుతోంది. దేశంలోని దాదాపు 800 జిల్లాల్లో కేవలం 10% ప్రాంతాల్లో మాత్రమే BIS యాప్ ద్వారా HUID కోడ్‌ను సరిచూసుకునే కనీస అవగాహన వినియోగదారులకు ఉందని ఆల్-ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ రాజేష్ రోక్డే తెలిపారు. టైర్-2, 3, 4 నగరాల్లో ఈ అవగాహన దాదాపు శూన్యంగా ఉండటంతో.. బులియన్ మార్కెట్‌లోని కొందరు కేటుగాళ్లు దీనిని ఆసరాగా చేసుకుంటున్నారన్నారు. నకిలీ స్టాంపులు, డిజిటల్ ఫోటోలను మార్ఫింగ్ చేసి మోసాలకు పాల్పడుతుండటం కస్టమర్లను బెంబేలెత్తిస్తోంది.
►ALSO READ | 2 రోజుల్లో రూ.20వేల కోట్లు వెనక్కి.. స్టాక్ మార్కెట్లను గడగడలాడిస్తున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు!
ఇబ్బందుల్లో చిన్న జ్యువెలర్స్
కేవలం ఛార్జీల పెంపే కాకుండా హాల్‌మార్కింగ్ కేంద్రాల్లో(AHC) తనిఖీ సమయం కూడా భారీగా పెరిగింది. ఒకప్పుడు కేవలం 6 గంటల్లో పూర్తయ్యే ప్రాసెస్, ఇప్పుడు 24 నుంచి 36 గంటలకు చేరింది. దీనివల్ల స్థానిక స్వర్ణకారులు, చిన్న స్థాయి జ్యువెలరీ వ్యాపారుల వర్కింగ్ క్యాపిటల్ రోజుల తరబడి బ్లాక్ అయిపోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలపై BIS వెంటనే స్పందించి ఛార్జీలను పాత స్థాయికి తగ్గించాలని, చిన్న పట్టణాల్లో వినియోగదారులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని జ్యువెలరీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.