Reading Time: < 1 minute
బస్సులో కబుర్లు చెప్పుకుంటూ.. ఇంటికి చేరకుండానే విషాదం.. ఏమైందంటే..?

ఆ ప్రయాణం మామూలుగానే మొదలైంది.. బస్సులో తోటి ప్రయాణికులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆమె ప్రయాణిస్తోంది. ఇంకొద్ది సేపట్లో తన స్వగ్రామం వస్తుంది.. బస్సు దిగితే ఇంటికి చేరుకోవచ్చనే ఆలోచనలో ఉంది. కానీ అంతలోనే విధి మరోలా నిర్ణయించింది. ఇంటి గడప తొక్కాల్సిన ఆమె.. మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ధర్మారం తండాకు చెందిన లావత్ చిన్ని (48) బస్సులో ప్రయాణిస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందింది. ఈ విషాద ఘటన ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గుండాల మండల కేంద్రం నుంచి ఇల్లందు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సులో ముంబై తండా వద్ద చిన్ని ఎక్కింది. ప్రయాణంలో తోటి ప్రయాణికులతో మాట్లాడుకుంటూ సాధారణంగానే కనిపించింది. మరికొద్దిసేపట్లో రొంపేడు వద్ద దిగాల్సి ఉండగా.. బస్సు అక్కడికి చేరుకునే సమయంలో ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కుప్పకూలింది. వెంటనే అప్రమత్తమైన బస్సు కండక్టర్, డ్రైవర్ నాగేశ్వరరావు, శ్రీనివాసులు ఆమెను రొంపేడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

కాసేపటి క్రితం వరకు తమతో మాట్లాడిన మహిళ.. కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో బస్సులోని ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను కలవాల్సిన ఆమె.. మార్గమధ్యంలోనే కన్నుమూయడంతో ధర్మారం తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి భర్తతో పాటు ఐదుగురు పిల్లలు ఉన్నారు. బస్సు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటికి చేరువవుతున్న కొద్దీ ఆనందం ఉండాల్సిన ఆ ప్రయాణం.. ఒక్కసారిగా ఓ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.