Reading Time: < 1 minute
Smit Machchhar Israel To Honour Indian Pilot After Flydubai Fz1073 Incident

Smit Machchhar: ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనలో ప్రయాణికుల్ని కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలపై ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో కో-పైలట్ దాడి చేసి విమానాన్ని కూల్చే ప్రయత్నిం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పైలట్ కత్తి గాయాలకు గురైనప్పటికీ, వెంటనే కాక్‌పిట్ తలుపులు తెరవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పైలట్ స్మిత్ సరైన సమయంలో కాక్‌పిట్ తెరవడంతో ప్రయాణికులు నిందితుడైన కో పైలట్‌ను అదుపులోకి తీసుకుని, విమానం కుప్పకూలకుండా అడ్డుకున్నారు. అనంతరం విమానం సౌదీ అరేబియాలోని టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది.

ఇదిలా ఉంటే, మెజారిటీ ఇజ్రాయిల్ జాతీయులే ఉన్న ఈ విమానాన్ని రక్షించిన స్మిత్ మచ్చర్‌పై ఇజ్రాయిల్ దేశం మొత్తం ప్రశంసలు కురిపిస్తోంది. ఆ దేశంలోనే ప్రతీ ఇంటిలో ఇప్పుడు భారత పైలట్ పేరే మారుమోగుతోంది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కూడా ఆయన సాహసాన్ని కీర్తించారు. భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా స్మిత్ ధైర్యాన్ని కొనియాడారు. ఇజ్రాయిల్‌లోని ప్రతీ ఇన్‌ఫ్లూయెన్సర్, ప్రతీ మీడియా ఇప్పుడు స్మిత్ జపమే చేస్తోంది.

భారతదేశంలో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ మాట్లాడుతూ.. కెప్టెన్ స్మిత్ ధైర్యాన్ని ఇజ్రాయిల్ ఎప్పటికీ మరిచిపోదని అన్నారు. ప్రెసిడెంట్, ప్రధాని నుంచి సామాన్య ప్రజలు వరకు ఆయన గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు. సంక్షోభ సమయంలో తమకు అండగా నిలిచిన మిత్రులను ఇజ్రాయిల్ మరిచిపోదని, స్మిత్‌ను గౌరవిస్తామని తెలిపారు. మరోవైపు, ఈ ఘటనలో స్మిత్‌కు అండగా నిలిచిన ఇజ్రాయిల్ ప్రయాణికుల్ని ఆ దేశం సత్కరించింది. అధ్యక్షుడు ఐజాక్ హోర్జోగ్ ప్రయాణికులు యానివ్ హయూన్, జ్వికా మానెస్, అసఫ్ రజువాన్, డాక్టర్ షోటా ముసాయేవ్‌లను ‘‘ప్రెసిడెంట్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’’ కోసం సిఫారసు చేశారు.