
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో విపరీతమైన కాలుష్యం, ఎండ తీవ్రత, జంక్ ఫుడ్ అలవాట్లు, పని ఒత్తిడి వల్ల ముఖం తన సహజ కాంతిని కోల్పోతోంది. దీనివల్ల వయసు పైబడకముందే చర్మంపై ముడతలు రావడం, మొటిమలు, మచ్చలు ఏర్పడటం వంటి సమస్యలు సర్వసాధారణంగా మారాయి. వీటి నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే ఖరీదైన రసాయన ఉత్పత్తుల కంటే.. వంటింట్లోనే ఉండే సహజసిద్ధమైన పదార్థాలను వాడటమే ఉత్తమమని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గ్రీన్ టీ.. చర్మ సౌందర్యాన్ని కాపాడటంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే గ్రీన్ టీని చర్మ సంరక్షణ కోసం ఏయే రూపాల్లో ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోవడం ముఖ్యం.
గ్రీన్ టీ బాడీ మిస్ట్ – రోజంతా తాజాదనం
గ్రీన్ టీని డికాషన్ లాగా తయారుచేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత దాన్ని ఒక శుభ్రమైన స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి. స్నానం చేసిన వెంటనే ముఖం మరియు శరీరంపై దీన్ని స్ప్రే చేసుకుంటే చర్మానికి మంచి తేమ, తక్షణ తాజాదనం అందుతాయి. ఈ మిస్ట్‌ను ఫ్రిజ్‌లో భద్రపరిచి, 2 నుంచి 3 రోజులలోపు వాడుకోవాలి.
గ్రీన్ టీ – బియ్యం నీటి టోనర్
బియ్యం కడిగిన నీటిని మరిగించి చల్లార్చి తీసుకోవాలి. ఇందులో సమపాళ్లలో చల్లారిన గ్రీన్ టీ మిశ్రమాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 5 నుంచి 10 నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఎలాంటి రసాయనాలు కలపని ఈ సింపుల్ టోనర్ చర్మ రంధ్రాలను శుభ్రపరిచి సహజ మెరుపును ఇస్తుంది.
గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ – పోర్స్ క్లోజ్ చేసేందుకు
చల్లారిన గ్రీన్ టీని ఐస్ ట్రేలో పోసి ఫ్రిజ్‌లో గడ్డకట్టించాలి. ఈ ఐస్ క్యూబ్‌ను ఎప్పుడూ నేరుగా ముఖంపై రుద్దకూడదు. ఒక పలుచని కాటన్ గుడ్డలో ఐస్ క్యూబ్‌ను చుట్టి, ముఖంపై వలయాకారంలో సున్నితంగా మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగై, ఓపెన్ పోర్స్ సమస్య తగ్గుతుంది.
కళ్ల వాపు, అలసటకు గ్రీన్ టీ ప్యాడ్స్
రోజంతా కంప్యూటర్ స్క్రీన్లు, మొబైల్స్ చూసి అలిసిపోయిన కళ్లకు గ్రీన్ టీ అద్భుత ఉపశమనం ఇస్తుంది. చల్లటి గ్రీన్ టీలో దూది ప్యాడ్లను ముంచి, కళ్లపై 5 నుంచి 7 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇది కళ్ల చుట్టూ ఉండే వాపును, బడలికను తగ్గించి రిఫ్రెష్ చేస్తుంది.
ఫేషియల్ స్టీమ్ – బాత్ సోక్
ఫేషియల్ స్టీమ్: గోరువెచ్చని నీటిలో గ్రీన్ టీని కలిపి, అందులో శుభ్రమైన కాటన్ టవల్‌ను ముంచి, నీటిని పిండేసి కొద్దిసేపు ముఖంపై పరుచుకోవాలి. ఇది చర్మం లోపలికి తేమను చేర్చి సాంత్వన చేకూరుస్తుంది.
బాత్ సోక్: రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీని బాత్‌టబ్‌లోని గోరువెచ్చని నీటిలో కలిపి 10 నుంచి 15 నిమిషాల పాటు రిలాక్స్ అవ్వొచ్చు. ఒంటికి జిడ్డుగా అనిపిస్తే ఆ తర్వాత మామూలు నీటితో స్నానం చేయాలి.
ఖరీదైన బ్యూటీ పార్లర్లకు వెళ్లకుండా, ఇంట్లోనే లభించే గ్రీన్ టీతో ఈ చిన్న జాగ్రత్తలు క్రమం తప్పకుండా పాటిస్తే ముఖ వర్చస్సు పెరిగి చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మెరుస్తుంది.