
తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ రిజర్వేషన్ల అంశంలో మళ్లీ పాత పాటే పాడుతూ బీసీ సోదరులను తీవ్రంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికల ముందు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చి రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని విమర్శించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇస్తే, చంద్రబాబు తన మనుషులతో కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకున్నారని గుర్తుచేశారు. ఆటంకాలు ఎదురైనప్పటికీ తమ ప్రభుత్వం 34 శాతానికి పైగా స్థానాల్లో బీసీ అభ్యర్థులకే టికెట్లు ఇచ్చి పోటీలో నిలిపిందని బొత్స స్పష్టం చేశారు. బీసీల బలహీనతలను ఆసరాగా చేసుకుని వారి భావోద్వేగాలతో ఆడుకోవడం సరికాదని హితవు పలికారు.
సుప్రీంకోర్టు పేరుతో నాటకాలు వద్దు..
ప్రస్తుతం కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ ఎన్డీయే కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉందని, బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్‌లో చట్టం చేయించాలని బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. తెలంగాణ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన 50 శాతం పరిమితి తీర్పు దేశంలోని అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని తెలిసి కూడా, మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పి ప్రజల చెవిలో పువ్వులు పెట్టాలని చూడటం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీలో ఉన్న బీసీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తమ నాయకుడిపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్‌లో బిల్లు పెట్టించే ధైర్యం ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల కేటాయింపులో టీడీపీ హయాంలో బీసీలకు జరిగిన న్యాయం ఎంత, తమ హయాంలో ఇచ్చిన ప్రాధాన్యత ఎంత అనేది లెక్కలతో సహా చర్చకు సిద్ధమని, తమది తక్కువైతే క్షమాపణలు కోరతామని చెప్పారు.
తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు భయం?
కూటమి ప్రభుత్వంలో డీఎస్సీ నియామకాలు సహా పలు అంశాల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని, పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం, జీవోలు ఇచ్చి రద్దు చేయడం ద్వారా వ్యవస్థలను పూర్తిగా భ్రష్టు పట్టించారని బొత్స ఆరోపించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లక్షన్నరకు పైగా ఉద్యోగాలు పారదర్శకంగా భర్తీ చేస్తే ఒక్క చిన్న మాట కూడా రాలేదని గుర్తుచేశారు. 2004లో తాను పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనపై కొన్ని ఆరోపణలు వస్తే, నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డితో మాట్లాడి స్వయంగా సీబీఐ విచారణ వేయించానని, తన మంత్రి పదవిని కూడా వదులుకున్నానని పేర్కొన్నారు. తప్పు చేయనప్పుడు విచారణలకు ఎందుకు భయపడుతున్నారో సమాధానం చెప్పాలని, తమ రాజకీయ స్వార్థం కోసం ప్రత్యర్థి పార్టీలపై బురద చల్లే దిగజారుడు రాజకీయాన్ని కూటమి నాయకులు మానుకోవాలని హెచ్చరించారు.