
టెల్ అవీవ్/న్యూఢిల్లీ: దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ లో జరిగిన ఘటన ఉగ్రదాడే అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ క్లారిటీ ఇచ్చారు. విమానంలో క్యాప్టెన్‌పై కత్తితో దాడి చేసి కూల్చేయాలని చూసిన కో-పైలట్ ఒమన్ దేశానికి చెందిన పౌరుడని ఆయన అధికారికంగా ధ్రువీకరించారు. ఇది ముమ్మాటికీ ‘జిహాదీ ఉగ్రదాడే’ అని ఆయన అభివర్ణించారు.
ఈ దుశ్చర్య వెనుక ప్రధాన ఉద్దేశం ఇజ్రాయెల్, యూఏఈ మధ్య ఉన్న సత్సంబంధాలను, అబ్రహం ఒప్పందాలను దెబ్బతీయడమేనని గిడియాన్ సార్ ఆరోపించారు. వీలైనంత ఎక్కువ మంది ఇజ్రాయెలీలను హతమార్చడంతో పాటు, శాంతియుతంగా ముందుకు వెళ్తున్న దేశాల మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యంగా ఈ ఉగ్రప్రయత్నం జరిగిందన్నారు. సౌదీ అరేబియాలో ప్రాథమిక దర్యాప్తు ముగిసిన తర్వాత నిందితుడిని యూఏఈకి అప్పగిస్తారని, అక్కడి నుంచి కో -పైలట్‌ను తమ దేశానికి రప్పించేందుకు (ఎక్స్‌ట్రాడిషన్) అన్ని ప్రయత్నాలు చేస్తామని స్పష్టం చేశారు.
ఈ ఉగ్రదాడి వెనుక ఇరాన్ ప్రమేయం ఉందనడానికి ఇప్పటికైతే ఎలాంటి ఆధారాలు లేవని, దర్యాప్తులో నిజాలు వెలుగులోకి వస్తే ప్రపంచం ముందు ఉంచుతామని తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో ప్రాణాలకు తెగించి వ్యవహరించిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ ధైర్యసాహసాలను మంత్రి గిడియాన్ సార్ కొనియాడారు.