Reading Time: < 1 minute
Lucknow Crime 17 Year Old Accused Of Killing Mother Over Gender Affirming Surgery Dispute

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. 17 ఏళ్ల మైనర్ తన తల్లిని కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. లింగ మార్పిడి శస్త్రచికిత్స చేసుకోవాలని 17 ఏళ్ల యువకుడు తల్లిని కోరడం, అందుకు తల్లి అభ్యంతరం తెలపడంతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. పుట్టుకతో మగవాడైన యువకుడు గురువారం తల్లిని హత్య చేశాడు. హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు అతడి డైరీలో గుర్తించారు. అందులో ఎలా చంపాలనే దాని గురించి ప్రస్తావించినట్లు పోలీసులు తెలిపారు.

శస్త్రచికిత్స విషయంలో తల్లి అభ్యంతరం చెప్పడంతో పాటు మెడికల్, కౌన్సిలింగ్ సహాయం తీసుకోవాలని సూచించడంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైనట్లు అధికారుతు తెలిపారు. ఆ సమయంలో మైనర్ యువకుడు తన వెంట తెచ్చుకున్న ఇనుప రెంచ్‌తో తల్లి తలపై పలుమార్లు దాడి చేశాడు. దీంతో మహిళ అక్కడికక్కడే మరణించింది.

హత్య తర్వాత సదరు యువకుడే పోలీసులకు ఫోన్ చేసి చెప్పినట్లు అధికారులు తెలిపారు. నాకా హిందోలా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. హత్యకు ఉపయోగించిన రెంచ్ స్వాధీనం చేసుకుని మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్య తర్వాత తాను మైనర్ కావడంతో ఎలాంటి శిక్షలు పడుతాయి, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? శిక్షలకు సంబంధించిన వివరాలను చాట్‌జీపీటీ ద్వారా తెలుసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.