కడప తిరుపతి మార్గంలో కడపకు సుమారు 40 కి.మీ. దూరంలో ఉన్న ఈ ఆలయం చోళుల కాలంలో నిర్మించబడినట్టు చరిత్ర చెబుతుంది. అద్భుతమైన శిల్పకళకు ప్రతీకగా ఈ ఆలయం నిలుస్తోంది. 11వ శతాబ్దంలో చోళ వంశ రాజులచే నిర్మించబడిన ఈ ఆలయం ఎంతో సువిశాలంగా 8 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
ఆలయంలోని 108 స్తంభాలు, వాటిపై చెక్కిన శిల్పాలు నాటి శిల్పుల అద్భుత ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఆలయ ప్రాంగణంలో యోగ నరసింహ స్వామి, ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వర స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన ఎర్రరాయి, అద్భుతమైన శిల్పాలు, విశాలమైన ప్రాంగణం, 108 స్తంభాలు ఈ క్షేత్రానికి ప్రత్యేక శోభను అందిస్తున్నాయి. ఈ 108 స్తంబాలు 108 ప్రదక్షిణ లను సూచిస్తుందని భక్తుల విశ్వాసం.
108 ప్రదక్షిణల తో కోరిన కోరికలు తీర్చే సౌమ్యనాధుడు ..సౌమ్యనాధ స్వామి ఆలయం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి తమ కోరికను స్వామివారికి చెప్పుకుని 108 ప్రదక్షిణలు చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.కోరిన కోరికలు తీరిన తరువాత భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ అన్నావాయితి.
ప్రతి రోజు స్వామివారి ని దర్శించుకుని ఇక్కడ ప్రదక్షిణ చేయడం ఎంతో ప్రాచుర్యం పొందింది. స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకోవడం, కోరికలు కోరుకోవడం జరుగుతోంది.
ఆలయం చరిత్ర, ఆలయం పై ఉన్న శిల్పకళ, ఆధ్యాత్మికత, భక్తి విశ్వాసాలు ఎంత ప్రాచుర్యం పొందాయో ఇక్కడ 108 ప్రదక్షిణలు కూడా అంతే ప్రాచుర్యం పొందాయి. తమ కోరిన కోరికలు తీరిన భక్తులు స్వామి వారి వద్దకు వచ్చి భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు చేయడం ఇక్కడ నిరంతరం జరుగుతోంది.




