Reading Time: 2 minutes
Ap Government To Sell Onions At Rs 35 Per Kg Through Rythu Bazars

Subsidised Onions: ఉల్లిపాయల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు ఊరట కల్పించేందుకు కిలో ఉల్లిపాయలను రూ.35కే సబ్సిడీపై అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో ఈ సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాలు ప్రారంభమయ్యాయి. విజయవాడ ఏపీఐఐసీ రైతు బజారులో మంత్రి నాదెండ్ల మనోహర్ సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాలను ప్రారంభించారు. వినియోగదారులకు స్వయంగా ఉల్లిపాయలను అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సివిల్ సప్లైస్ కమిషనర్ కన్నబాబు, సివిల్ సప్లైస్ డైరెక్టర్ శ్రీవాస్ నూపుర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. ధరల స్థిరీకరణపై మంత్రివర్గ ఉపసంఘం అనేక కోణాల్లో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.75 వరకు ఉన్న ఉల్లిపాయలను సబ్సిడీ ద్వారా రూ.35కే అందిస్తున్నామని చెప్పారు.

మినీ లారీలతోనూ ఉల్లిపాయల విక్రయాలు
యుద్ధ వాతావరణం, ఎల్‌నినో ప్రభావం వంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కొంతమంది వర్తకులు ధరల పెరుగుదల కోసం ఉల్లిపాయలను నిల్వ చేయడం కూడా ధరల పెరుగుదలకు కారణమైందని మంత్రి మనోహర్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో మినీ లారీల ద్వారా కూడా ఉల్లిపాయలను నేరుగా సామాన్యులకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. కందిపప్పు, పామాయిల్ ధరలపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. 1.20 లక్షల మెట్రిక్ టన్నుల కందిపప్పును తీసుకొచ్చి ప్రజలకు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నాణ్యత విషయంలోనూ పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. కొత్తగా మరో వెయ్యి మినీ మార్టులను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు.

బియ్యం కొరత లేదు
ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటోందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో బియ్యం కొరత ఉందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాబోయే మూడేళ్ల వరకు ఏపీలో బియ్యం కొరత ఉండదని స్పష్టం చేశారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందుగానే సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. బీపీటీ స్టీమ్డ్ రైస్‌ను కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఇక, ఎన్టీఆర్ జిల్లాలో సీబీడీ క్యాష్ రూపంలో తీసుకునే వారికి త్వరలో అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. నిత్యావసర వస్తువుల ధరలు, సరఫరాపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని తెలిపారు. రైతు బజార్ల ప్రధాన ఉద్దేశం రైతులు మధ్యవర్తులు లేకుండా నేరుగా వినియోగదారులకు ఉత్పత్తులు విక్రయించేలా చేయడం, వినియోగదారులకు సరసమైన ధరలకు నాణ్యమైన సరుకులు అందించడం అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్‌..