Reading Time: 2 minutes
Rbi Repo Rate Hike October 7 2026 Loan Emi Impact

Repo Rate Hike: పండుగల సీజన్‌లో కొత్త ఇల్లు కొనాలని, కారు లేదా బైక్ ఇంటికి తెచ్చుకోవాలని కలలు కంటున్న సామాన్యుడి జేబుకు భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో అల్లాడుతున్న సామాన్యుడిపై మరో పిడుగు పడబోతోందా? గత మూడేళ్లుగా చూడని రీతిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్లను పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోందా? అంటే ఆర్థిక నిపుణులు ‘అవుననే’ సంకేతాలు ఇస్తున్నారు. అక్టోబర్ 5 నుంచి 7 వరకు జరగనున్న ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) కీలక భేటీపై ఇప్పుడు దేశవ్యాప్తంగా సామాన్యుల నుంచి కార్పొరేట్ దిగ్గజాల దాకా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఫిబ్రవరి 2023 తర్వాత మళ్లీ అదే దెబ్బ

మార్కెట్ వర్గాలను అత్యంత భయాందోళనలకు గురిచేస్తున్న అంశం ఒకటుంది. దాదాపు మూడేళ్లుగా, అంటే ఫిబ్రవరి 2023 తర్వాత ఆర్బీఐ ఎప్పుడూ రెపో రేటును పెంచలేదు. పైగా 2025లో ఏకంగా 125 బేసిస్ పాయింట్ల మేర కోత విధించి రుణగ్రహీతలకు ఊరటనిచ్చింది. ప్రస్తుతం రెపో రేటు 5.25 శాతంగా ఉంది. కానీ రాయిటర్స్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. దాదాపు 60 శాతం మంది ఆర్థిక నిపుణులు ఈసారి ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇదే జరిగితే పండుగల వేళ హోమ్ లోన్లు, కార్ లోన్లు, పర్సనల్ లోన్లపై బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం ఖాయం. ఫలితంగా ప్రతి నెలా కట్టే ఈఎంఐల భారం ఒక్కసారిగా ఎగబాకనుంది. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచే దిశగా ఆలోచించడానికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణమే. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టు నాటికి 4.82 శాతానికి చేరింది. ఆర్బీఐ నిర్దేశించుకున్న 4 శాతం మధ్యకాలిక లక్ష్యాన్ని దాటి వరుసగా మూడో నెల కూడా ద్రవ్యోల్బణం పైపైకే దూసుకెళ్తోంది. ముఖ్యంగా మార్కెట్లో నిత్యావసరాలు, ఆహార పదార్థాలు, ఇంధన ధరలు మండిపోతుండటం సెంట్రల్ బ్యాంకును ఆందోళనకు గురిచేస్తోంది.

అంతర్జాతీయ సంక్షోభాలు.. రూపాయి పతనం
దేశీయ పరిస్థితులకు తోడు అంతర్జాతీయంగా కూడా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, డాలరుతో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడటం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వంటి గ్లోబల్ బ్యాంకులు తీసుకుంటున్న కఠిన ద్రవ్య విధానాలు ఆర్బీఐపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఆర్థిక వృద్ధిని కాపాడుకుంటూనే, అదుపు తప్పుతున్న ధరల మంటను చల్లార్చడం ఆర్బీఐ ముందున్న పెను సవాలుగా మారింది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీ అక్టోబర్ 5 నుంచి చర్చలు జరపనుంది. అనంతరం అక్టోబర్ 7న ఉదయం సరిగ్గా 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన నిర్ణయాలను అధికారికంగా ప్రకటించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడిస్తారు. ప్రస్తుతం ఉన్న 5.25 శాతం వద్దే రేట్లను స్థిరంగా ఉంచుతారా లేక పండుగ పూట ఊహించని బాదుడుతో సామాన్యుడికి ఈఎంఐ షాక్ ఇస్తారా అన్నది తెలియాలంటే అక్టోబర్ 7 ఉదయం వరకు ఆగాల్సిందే.