
OTR: నామినేటెడ్ పోస్ట్ ఫర్ సేల్. రండి బాబూ… రండి…. ఆలసించిన ఆశాభంగం. క్యాష్ కొట్టు…, పోస్ట్ పట్టు. సొసైటీ ఛైర్మన్‌కైతే ఒక రేటు ఇంకో డైరెక్టర్ పదవికైతే మరో రేటు. ఇక మాటల్లేవ్… మాట్లాడ్డాల్లేవ్…. ఓన్లీ మనీ మేటర్సేనని అంటున్నారట ఆ ఎమ్మెల్యే. తన పరిధిలోని అన్ని నామినేటెడ్ పోస్ట్‌లకు దాని స్థాయిని బట్టి రేటు కట్టి… అంగట్లో సరుకుగా మార్చేశారట. ఎవరా శాసనసభ్యుడు? ఎక్కడ జరుగుతోందా భలేమంచి కాస్ట్‌లీ బేరం? ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సదరు శాసనసభ్యుడు ప్రతి పోస్ట్‌కో రేటు కట్టి… కప్పం కట్టిన వాళ్ళకే అప్పగిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆయన తీరుపై హస్తం కేడర్‌లో కూడా తీవ్రమైన అసంతృప్తి పెల్లుబుకుతోందట.మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉండి… కష్ట కాలంలో కూడా జెండా వీడకుండా ఉన్న వాళ్లను కాదని, తనకు కప్పం కట్టిన వాళ్ళు, కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌తో చేపడుతున్న పనుల ప్రొసీడింగ్స్‌కి 5శాతం వాటా నడుస్తోందని కాంగ్రెస్ శ్రేణులే చెప్పుకుంటున్నాయి.
ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా సదరు శాసనసభ్యుడి కొడుకు జోక్యం ఎక్కువైపోయిందన్న గుసగుసలు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నాయి. ఇక నామినేటెడ్ పదవుల సంగతైతే చెప్పేపనేలేదంటున్నారు. ఇటీవల వ్యవసాయ సహకార పరపతి సంఘాల డైరెక్టర్లు, చైర్మన్ పోస్టుల కోసం బేరసారాలు గట్టిగానే నడిచాయట. సొసైటీ ఛైర్మన్ పోస్ట్‌కు 5 నుంచి 20 లక్షల వరకు డిమాండ్ చేయగా… 5 నుండి 10 లక్షల వరకు ముట్ట చెప్పిన వాళ్లకు మాత్రమే దక్కాయన్న ప్రచారం ఉంది. ఆ నియోజకవర్గంలో 12 PASCలు ఉంటే ఇప్పటి వరకు ఆరు సంఘాల చైర్మన్ ఎన్నికలు పూర్తయ్యాయి. అన్నీ… డబ్బులున్నవాళ్ళకే దక్కడాన్ని బట్టి చూస్తే… ఏం జరుగుతోందో తేలిగ్గా అర్ధమైపోతుందని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. నియోజకవర్గ హెడ్ క్వార్టర్‌లోని సొసైటీ చైర్మన్ పదవికి 20 లక్షల వరకు ముట్టాయన్న గుసగుసలు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో వినిపిస్తున్నాయి. వ్యవసాయదారులకు కాకుండా వ్యాపార వర్గాలకు సొసైటీ ఛైర్మన్ పదవులు దక్కడం వెనక బేరసారాలు గట్టిగానే నడిచాయన్నది లోకల్ టాక్.
మండలాధ్యక్షుల నియామకాల సందర్భంగా కూడా బేర సారాలు జరిగాయని ఆరోపణలు వచ్చినా… పెద్దగా పట్టించుకోని కాంగ్రెస్ క్యాడర్… ఇప్పుడు మాత్రం ఈ పోస్టులపై వాయిస్ రెయిజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే తీరుపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ సీనియర్స్ సిద్దమవుతున్నారట. పదేళ్ళు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళను పట్టించుకోకుండా తనకు నచ్చిన వాళ్లు, నచ్చని వాళ్ళంటూ విభజించి ఉపాధి హామీ పనుల విషయంలో చూపుతున్న వివక్ష ఏకంగా కాంగ్రెస్ పార్టీనే డ్యామేజ్ చేస్తోందని అంటున్నారు. ఎన్నికల సమయంలో అన్ని గ్రామాల్లో పర్యటించకున్నా, పెద్దగా సొంత కేడర్ అంటూ లేకున్నా… కాంగ్రెస్ వేవ్‌లో గెలిచిన ఎమ్మెల్యే అవకాశం ఇప్పుడు పోతే మళ్లీ రాదన్నట్టు ఆబగా దండుకుంటున్నారన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. పైగా… ఆయన సొంతదానికంటే ఎక్కువగా పక్క నియోజకవర్గంలోనే ఉంటున్నారట. దాంతో….. సార్‌ని కలవాలంటే సామాన్య జనానికి చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పుకుంటున్నారు.
సీనియర్ కార్యకర్తలు సైతం కనీసం మూడు నాలుగు సార్లు తిరుగితేనే ఆయన కలిసే పరిస్థితులు ఉన్నాయట. సీఎంఆర్‌ఎఫ్, కల్యాణలక్ష్మి స్కీమ్స్ కోసం ఎమ్మెల్యేను కలవడానికి వెళితే…. గ్రామస్తుల ముందే మీదే ఊరని అడుగుతుండటంతో…మండల స్థాయి సీనియర్ నాయకులు కూడా తలలు పట్టుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇలా ఒకటేమిటి… సార్ చిన్నెలు అన్నీ ఇన్నీ కావని కాంగ్రెస్ కేడరే అంటోంది. మూడేళ్ళ తర్వాత కూడా కనీసం నాయకుల ముఖాలు గుర్తులేకపోతే ఇక ఆయన రాజకీయం ఏం చేస్తారంటూ వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నారు. బేరసారాల్ని ఆపేయడం, అసంతృప్తిగా ఉన్న సొంత కేడర్‌ని బుజ్జగించడం లాంటి పనుల్ని వెంటనే చేయకుంటే… సదరు ఎమ్మెల్యేకి మళ్లీ సీటిచ్చినా ఆశలు వదులుకోవాల్సిందేనని ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ కేడరే మాట్లాడుకుంటోంది.