
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి డీజీపీ సీవీ ఆనంద్ కు వినతిపత్రం అందించారు తాళ్లరాంపూర్ బాధితులు. గురువారం ( అక్టోబర్ 1 ) డీజీపీని కలిసిన వీడీసీ బాధితులు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తమ గురించి దుష్ప్రచారం జరుగుతున్న క్రమంలో వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నామని లేఖలో పేర్కొన్నారు తాళ్లరాంపూర్ వీడీసీ బాధితులు.
తమపై కొత్తగా ఎలాంటి కేసు నమోదు కాలేదని… గతంలో నమోదైన కేసులకు సంబంధించిన చార్జ్‌షీట్లు మాత్రమే ఇప్పుడు వేస్తున్నారని అన్నారు. అయితే కొత్తగా ఏదో జరిగినట్లు కొన్ని విషయాలను ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని అన్నారు.
గౌడ సంఘానికి సంబంధించిన భూమిని గురడి కాపు వర్గానికి చెందిన వారు ఆక్రమించి విక్రయించారనే అంశంపై మేము ప్రశ్నించామని… గౌడ సంఘానికి సంబంధించిన భూమిని ఎలా విక్రయిస్తారు..? మా భూమిని అక్రమంగా ఎలా అమ్ముతారు..?” అని ప్రశ్నించామని పేర్కొన్నారు. మేము అడిగిన ప్రశ్నలను దృష్టిలో పెట్టుకుని కొందరు వ్యక్తులు మా పట్ల వ్యతిరేకత పెంచుకుని, ఆ విషయాన్ని VDC పేరుతో మాపై మోపారని అన్నారు. దానిని ఆసరాగా తీసుకుని తాడి చెట్లు ఎక్కే విషయంలో మాపై ఆంక్షలు విధించారని అన్నారు.
“మా వయస్సు, మా పరిస్థితుల దృష్ట్యా మేము తాడి చెట్లు ఎక్కలేమని చెప్పినందుకు మమ్మల్ని బహిష్కరిస్తారా? ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు బాధితులు.
అంతేకాకుండా, ఎవరూ గౌడ సంఘం వారి వద్ద కల్లు తాగడానికి వెళ్లకూడదని, ఎవరైనా వెళితే జరిమానా విధిస్తామని ఆంక్షలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాలక్రమంలో అక్కడికి కల్లు తాగడానికి వెళ్లిన కొందరిని బెదిరించిన సంఘటనలు జరిగాయని… ఇదేమిటని ప్రశ్నించినప్పుడు కూడా సరైన సమాధానం ఇవ్వలేదని… ఇంతటితో ఆగకుండా, గౌడ కులస్తుల మహిళలను శ్రీరామ నవమి కుంకుమార్చన కార్యక్రమం నుండి బహిష్కరించారని అన్నారు.
అదేవిధంగా, గ్రామంలోని ఈతవనంలో ఈత చెట్లను కాల్చివేయడం, కొత్తగా గీసిన చెట్లను నరికివేయడం వంటి ఘటనలు జరిగాయని అన్నారు. అంతేకాకుండా, తమపై దాడి చేస్తామని కొందరు వచ్చిన సమయంలో గ్రామంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ, ఆ పరిస్థితిని కూడా పట్టించుకోలేదని అన్నారు.
ఈ వివాదానికి సంబంధం ఉన్న కొద్దిమంది వ్యక్తులు ఇతర గ్రామ ప్రజలను కూడా రెచ్చగొట్టి, చివరకు పోలీసులతో కూడా ఘర్షణ జరిగే పరిస్థితి ఏర్పడేలా చేశారని అన్నారు.ఆ తర్వాత ఆర్మూర్ RDO కార్యాలయంలో రాజీ కోసం సమావేశం జరిగినప్పుడు, VDCలోని కొందరు వ్యక్తులు ₹6.50 లక్షలు ఇవ్వాలని కోరారని పేర్కొన్నారు. అందుకు తాము అంగీకరించలేదని.. గతంలో లాగా ప్రతి ఏటా ఇచ్చిన విధంగా కొంత మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పామని.. అందుకు వారు అంగీకరించలేదని.. ఆ తర్వాత తమపై దాడి జరిగిందని అన్నారు.
ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో తాళ్లరాంపూర్ ప్రజలు తెలుసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఎవరైనా చెప్పిన మాటలను వెంటనే నమ్మకుండా, జరిగిన సంఘటనలను రెండు వైపులా తెలుసుకుని నిర్ణయించుకోవాలని అన్నారు. కొద్దిమంది వ్యక్తులు నడుపుతున్న వ్యవహారంలో మన గ్రామానికి చెందిన అమాయక ప్రజలు బలికావడం, కేసుల్లో ఇరుక్కోవడం జరగకూడదని అన్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశం లేకపోవడం వల్లే లేఖ ద్వారా ముందుకొస్తున్నామని అన్నారు.
మేము చేస్తున్న ఆరోపణల వల్ల మళ్లీ కొత్త సమస్యలు లేదా కొత్త వివాదాలకు దారితీసే ప్రయత్నాలు జరగవచ్చనే ఆందోళన ఉందని.. గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి వివాదాల్లోనూ తొందరపడి పాల్గొనకుండా, చట్టపరమైన మార్గాల్లోనే సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు. గ్రామ ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం తమ ఉద్దేశం కాదని… అసలు విషయాలను ప్రజల ముందుంచి, అమాయక ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు.