Reading Time: 2 minutes

దుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు.. పైలట్ పై కో పైలట్ దాడి

Caption of Image.
  • ఫ్లైట్ ​నుంచి హైజాక్ సిగ్నల్స్
  • 34 వేల అడుగుల నుంచి 16 వేల ఫీట్లకు విమానం డౌన్
  • సౌదీ అరేబియాలో ఫ్లైట్ సేఫ్ ​ల్యాండ్
  • హైజాక్ సమాచారంతో రంగంలోకి ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు 
  • బాధితుడు ఇండియన్ పైలట్ అని ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు

 దుబాయ్/టెల్ అవీవ్: దుబాయ్ నుంచి ఇజ్రాయెల్​లోని టెల్ అవీవ్​కు బయలుదేరిన ఓ విమానంలో బుధవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కాక్ పిట్ లో ఇద్దరు పైలట్ల మధ్య కత్తిపోట్లు తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘర్షణ సమయంలో విమానం నుంచి ఎమర్జెన్సీ, హైజాక్ సిగ్నల్స్ రావడంతో తీవ్ర ఆందోళనలు రేకెత్తాయి. దీంతో విమానం హైజాక్​కు గురైందనే ఆందోళనతో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి విమానం సౌదీ అరేబియాలోని తబూక్ ఎయిర్ పోర్ట్ లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 27 మంది చిన్నారులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం అందరినీ ఉలిక్కిపాటుకి గురిచేసింది.

కాక్ పిట్​లో పైలట్ల మధ్య ఘర్షణ

ఫ్లై దుబాయ్ ఎయిర్ లైన్స్​కు చెందిన బోయింగ్737 మ్యాక్స్ 8 విమానం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి టెల్ అవీవ్​లోని బెన్ గురియన్ విమానాశ్రయానికి బయలుదేరింది. రెండున్నర గంటల ప్రయాణం తర్వాత విమానం నుంచి మొదట 7700 ఎమర్జెన్సీ కోడ్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే 7500 కోడ్ ప్రసారం అయింది. 7500 కోడ్​ను కాక్ పిట్​లోకి ఎవరైనా చట్టవిరుద్ధంగా చొరబడినప్పుడు లేదా హైజాక్ అయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు రిలీజ్ చేస్తారు. కాగా, కోడ్ వచ్చిన కొద్దిసేపటికి కేవలం 2 నిమిషాల వ్యవధిలోనే విమానం 34 వేల అడుగుల నుంచి 16,600 అడుగుల కిందికి పడిపోయింది. 

అదే సమయంలో కాక్ పిట్ నుంచి అరుపులు, కేకలు వినబడడంతో విమానంలో ఉన్న కొందరు ఆఫ్ -డ్యూటీ పైలట్లు, ఇతర ప్రయాణికులు కాక్ పిట్ డోర్ తెరిచి చూసేసరికి గాయపడిన కెప్టెన్ కనిపించాడు. ఒమన్ కు చెందిన కో-పైలట్.. కెప్టెన్ పై ఫోల్డింగ్ కత్తితో దాడి చేశాడని ప్రయాణికులు గుర్తించారు. ఈ ఘర్షణతో కాక్ పిట్ లోపల రక్తపు మరకలు ఏర్పడ్డాయి. వెంటనే వారు కో పైలట్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆఫ్-డ్యూటీ పైలట్లు విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ లో ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం పైలట్​ను ఆస్పత్రికి తరలించి, కో పైలట్​ను అరెస్ట్ చేశారు. 

కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘పైలట్ ను కో పైలట్ హత్య చేయడానికి ప్రయత్నించాడు. మేము అతన్ని అడ్డుకున్నాము. అతను ఈ విమానంలో మాపై కూడా దాడి చేశాడు’ అని ప్రయాణికులు తెలిపారు.

గాల్లోకి ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు..

విమానం నుంచి హైజాక్ సిగ్నల్స్ అందడంతో ఇజ్రాయెల్ అధికారులు అప్రమత్తమయ్యారు. తొలుత హైజాక్​గా పరిగణించి వెంటనే యుద్ధ విమానాలను రంగంలోకి దించినట్టు నివేదికలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్, ఇతర భద్రతా అధికారులతో అత్యవసర భద్రతా సమావేశాలు నిర్వహించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. 

అయితే, ఇది ఉగ్రవాద చర్య కాదని, పైలట్ల మధ్య వ్యక్తిగత ఘర్షణ లేదా మెంటల్ఇన్ స్టెబిలిటీ వల్ల జరిగిన సంఘటనగా ప్రాథమికంగా గుర్తించి హైజాక్ వార్తలను తోసిపుచ్చారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. అయితే, ఘటనను కేవలం పైలట్ ల మధ్య వ్యక్తిగత ఘర్షణగా పరిగణించాలా? లేక మరేదైనా ఉద్దేశం ఉందా? అన్న అంశంపై ఇజ్రాయెల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  పైలట్ల మధ్య ఘర్షణకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు.

180 మంది ప్యాసింజర్లను కాపాడిన ఇండియన్ పైలట్?

ఈ విమాన ఘటనలో కో- పైలట్​తో పోరాడి.. ప్రయాణికులను కాపాడిన కెప్టెన్ భారతీయుడని తెలిసింది. కత్తిపోటుకు గురైన కెప్టెన్ స్మిత్​ మచ్ఛర్ భారత్​కు చెందినవాడని ఇజ్రాయెల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆయన తన ప్రాణాలకు తెగించి కో పైలట్​తో పోరాడారని.. విమానం కూలిపోకుండా అడ్డుకుని 180 మంది ప్రాణాలను కాపాడారని కథనాలు ప్రచురించాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. 

స్మిత్​కు 13 ఏళ్ల అనుభవం ఉందని, గతంలో స్పైస్ జెట్​లో 11 ఏండ్లు పైలట్​గా సేవలందించారని సమాచారం. 2023లో ఫ్లైదుబాయ్​లో చేరారని తెలుస్తోంది. కాగా, దాడికి పాల్పడిన కో- పైలట్ ఒమన్ జాతీయుడని ఇజ్రాయెల్ మీడియా కథనాలు ఆరోపించాయి. విమానాన్ని కూల్చేందుకే ఉద్దేశపూర్వకంగా ఆయన కెప్టెన్​పై దాడిచేసినట్టు తొలుత ఆరోపణలు వచ్చాయి. టెల్అవీవ్​కు వెళ్లే విమానంలో ఒమన్ పౌరుడిని ఎలా అనుమతించారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

©️ VIL Media Pvt Ltd.