Reading Time: 2 minutes

ఫామ్7 వినియోగించి మైనారిటీ ఓట్లు తొలగించే ప్రయత్నం.. బీజేపీ నేతలపై కేసులు

Caption of Image.

దేశంలో సర్ ప్రక్రియపైనా, ఓట్ల తొలగింపు అంశంపైనా తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో.. ఫామ్ 7 ఉపయోగించి మైనారిటీల ఓట్లు తొలగించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. కర్ణాటకలో పలువురు బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్నికల కమిషన్, బీజేపీ మధ్య మైనారిటీ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని పేర్లు తొలగించే కుట్ర ఉందన్న ఆరోపణల మధ్య ఈ ఎఫ్ఐఆర్ లు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.  

బెలగావిలో ఎఫ్‌ఐఆర్  

బెలగావి జిల్లాలో 198 మంది ముస్లిం ఓటర్ల పేర్లు తొలగించేందుకు ఫారం-7 ఫామ్స్ సమర్పించినట్లు ఆరోపణలు వచ్చాయి.  బీజేపీ నాయకులు రవి పాటిల్, శంకర్ బీరప్ప నాయక్, ప్రశాంత్ దీపక్ ముందిన్మణి తదితరులపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సెప్టెంబర్ 30న బెలగావి మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేశారు. బెలగావి నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం వార్డు నం.12లో బూత్ లెవల్ ఏజెంట్‌గా పనిచేస్తున్న మీరాసాబ్ సనది ఫిర్యాదు ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు.

ఫిర్యాదు ప్రకారం, 2026 సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో 20-25 మందితో కలిసి ముస్లిం ఓటర్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుని 198 మంది పేర్లు తొలగించేందుకు కుట్ర పన్నారు. నకిలీ పత్రాలు తయారు చేసి, వాటిని జెన్యూన్‌గా చూపి బీఎల్‌ఓకు సమర్పించారు. ఫారం-7లో ఫిర్యాదుదారు, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయని ఆరోపించారు. బీఎల్‌ఓపై ఒత్తిడి తెచ్చి, ఎఆర్‌ఓగా నటించి ఫోన్‌లో మాట్లాడించి సంతకం తీసుకున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి.  భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 318(4), 336(3), 336(4), 353, 61(2), 3(5), 192, 190 కింద కేసు నమోదైంది. విచారణ కొనసాగుతోంది.

బీదర్‌లో మరో కేసు  

బీదర్ జిల్లా భాల్కీకి చెందిన వ్యాపారి, ఓటరు మొహమ్మద్ అతీక్ అహ్మద్ ఫిర్యాదు ఆధారంగా మరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. 3,244 మంది ఓటర్లు (తనతో సహా) ‘షిఫ్ట్/అబ్సెంట్’గా చూపించి ఫారం-7 దరఖాస్తులు సమర్పించినట్లు ఆయన ఆరోపించారు. ప్రామాణిక పత్రాలు లేకుండా, నకిలీ సంతకాలు  చేసి పేర్లు తొలగించే ప్రయత్నం  చేశారని పేర్కొన్నారు. 2026 అక్టోబర్ 1న 32 మందిపై కేసు నమోదు చేశారు.

మైసూరులో..

మైసూరులో సామాజిక కార్యకర్త సయ్యద్ హసరత్ ఉల్లా తన కుటుంబ సభ్యులు చాలా సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్నా, అక్కడ లేరని ఫారం-7లో తప్పుడు సమాచారం ఇచ్చారని  ఆరోపించారు. మరో 28 మంది ఓటర్లపై కూడా ఇలాంటి దరఖాస్తులు సమర్పించినట్లు పేర్కొన్నారు. నరసింహరాజా పోలీస్ స్టేషన్‌లో హరీష్ కుమార్ సి, రాఘవేంద్ర ఎం, అనిల్ థామస్ (బీజేపీ మైనారిటీ ప్రెసిడెంట్) తదితరులపై కేసు నమోదైంది. ఇది మత విద్వేషాలను  దెబ్బతీసి సమాజంలో అశాంతి సృష్టించే ప్రయత్నమని ఆరోపించారు. 

ఈ క్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు గురువారం (అక్టోబర్ 01) చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వి. అన్బుక్కుమార్ కార్యాలయం ముందు ధర్నా చేసి, ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ‘ఓటు చోరీ’పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

©️ VIL Media Pvt Ltd.