Reading Time: < 1 minute
మీరు తినే గుడ్లు నిజమైనవేనా? నకిలీ ఎగ్స్ ని ఇంట్లోనే గుర్తించే సులభమైన చిట్కాలు!

ప్రస్తుతం మార్కెట్‌లో నకిలీ గుడ్లు విక్రయిస్తున్నారనే వార్తలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిజమైన గుడ్లకు, నకిలీ గుడ్లకు మధ్య తేడాను ఇంట్లోనే సులభంగా గుర్తించడానికి కొన్ని ప్రత్యేక పరీక్షలు సహాయపడతాయి.ఈ చిన్న చిట్కాలతో నాణ్యమైన, ఆరోగ్యకరమైన గుడ్లను సులభంగా ఎంచుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

పెంకు రూపురేఖలను పరిశీలించడం:

నిజమైన గుడ్డు పెంకు పైన కొద్దిగా మందకొడిగా, సహజమైన చిన్న చిన్న రంధ్రాలతో ఉంటుంది. కానీ నకిలీ గుడ్డు పెంకు చాలా నునుపుగా, మితిమీరిన మెరుపుతో కనిపిస్తుంది. అలాగే నకిలీ గుడ్డును తాకినప్పుడు అది కాస్త గట్టిగా, ప్లాస్టిక్ పదార్థంలా అనిపిస్తుంది.

పగులగొట్టినప్పుడు పరిశీలన:

గుడ్డును ఒక గిన్నెలో పగులగొట్టినప్పుడు, నిజమైన గుడ్డులోని పసుపుసొన, తెల్లసొన వేర్వేరుగా ఉంటాయి. మనం స్వయంగా కలిపితే తప్ప అవి కలవవు. కానీ నకిలీ గుడ్డును పగులగొట్టిన వెంటనే పసుపుసొన, తెల్లసొన దానంతట అదే విరిగిపోయి త్వరగా కలిసిపోతాయి.

నిప్పుపై కాల్చే పరీక్ష:

నకిలీ గుడ్లను గుర్తించడానికి ఇది అత్యంత ఖచ్చితమైన పద్ధతి. నకిలీ గుడ్డు పెంకును కొద్దిగా నిప్పుపై లేదా కొవ్వొత్తి వెలుగులో ఉంచితే అది ప్లాస్టిక్ కాలినట్లు నల్లగా మారి, ప్లాస్టిక్ వాసన వస్తుంది. నిజమైన గుడ్డు పెంకు నిప్పుపై కాలదు.

శబ్దం ఆధారంగా గుర్తించడం:

గుడ్డును చేతిలోకి తీసుకుని చెవి దగ్గర ఉంచి మెల్లగా ఊపినప్పుడు, నిజమైన గుడ్డు లోపల నుండి ఎలాంటి శబ్దం రాదు. కానీ నకిలీ గుడ్డులో ద్రవం ప్లాస్టిక్ పూతతో సరిగ్గా నిండకపోవడం వల్ల ఊపినప్పుడు లోపల నీరు కదులుతున్నట్లు శబ్దం వస్తుంది.

నీటి పరీక్ష:

ఒక పాత్రలో నీరు తీసుకుని అందులో గుడ్డును వేయాలి. నిజమైన, తాజా గుడ్డు నీటి అడుగుభాగానికి మునిగిపోతుంది. ఒకవేళ గుడ్డు నీటిపై తేలియాడితే అది నకిలీది లేదా పూర్తిగా పాడైపోయినదని అర్థం చేసుకోవాలి. ఆరోగ్యం కోసం తినే గుడ్ల విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు నమ్మకమైన వ్యాపారుల వద్ద లేదా నాణ్యతా ప్రమాణాలు కలిగిన డెయిరీల నుండి గుడ్లను కొనుగోలు చేయడం శ్రేయస్కరం. సందేహం ఉంటే పైన తెలిపిన పరీక్షలు చేసి నిర్ధారించుకున్న తర్వాతే వినియోగించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..