July 20, 2026

అంపైర్ నిర్ణయంతో రచ్చ.. కొట్టుకునేందుకు దూసుకొచ్చిన ఆటగాళ్లు.. ఆ తర్వాత..!

అంపైర్ నిర్ణయంతో రచ్చ.. కొట్టుకునేందుకు దూసుకొచ్చిన ఆటగాళ్లు.. ఆ తర్వాత..!
Reading Time: 2 minutes
అంపైర్ నిర్ణయంతో రచ్చ.. కొట్టుకునేందుకు దూసుకొచ్చిన ఆటగాళ్లు.. ఆ తర్వాత..!

జింబాబ్వే, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపడమే కాకుండా ఈ ఏడాదిలోనే అత్యంత వివాదాస్పద మ్యాచ్‌గా నిలిచింది. సిరీస్ విజేతను తేల్చే ఈ పోరులో అంపైర్ తీసుకున్న ఒక వివాదాస్పద నిర్ణయం మైదానంలో ఆటగాళ్ల మధ్య పెద్ద గొడవకు దారితీసింది. ఇరు జట్ల ఆటగాళ్లు కొట్టుకున్నంత పని చేయడంతో లార్డ్స్ తరహాలోనే ఇక్కడా ఉద్రిక్తత నెలకొంది.

చివరి ఓవర్ ఉత్కంఠ.. హ్యాట్రిక్ ముంగిట బౌలర్..!

మూడో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణీత ఓవర్లలో 143 పరుగులు చేసింది. అనంతరం 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు విజయానికి చివరి ఓవర్లో 5 పరుగులు అవసరమయ్యాయి. జింబాబ్వే బౌలర్ బ్రాడ్ ఈవాన్స్ అద్భుతమైన బౌలింగ్‌తో వరుసగా రెండు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ సాధించే అవకాశాన్ని అందుకున్నాడు. బంగ్లాదేశ్ వరుస వికెట్లు కోల్పోయి పరాజయం అంచుల్లో నిలిచింది. ఆ సమయంలో ఎనిమిదో స్థానంలో మహేదీ హసన్ క్రీజులోకి వచ్చాడు.

అంపైర్ వివాదాస్పద నిర్ణయం.. రాజుకున్న వివాదం!

బంగ్లాదేశ్ విజయానికి 3 బంతుల్లో 4 పరుగులు కావాల్సిన తరుణంలో ఈవాన్స్ వేసిన లో-ఫుల్‌టాస్ బంతిని మహేదీ హసన్ ఆడలేకపోయాడు. బంతి నేరుగా వచ్చి ప్యాడ్లను తాకడంతో జింబాబ్వే ఆటగాళ్లు వికెట్ దక్కిందన్న ఆనందంలో మునిగిపోయారు. కానీ, అక్కడే ఊహించని మలుపు తిరిగింది. బౌలర్ బంతిని విసిరే సమయంలో జింబాబ్వే వికెట్ కీపర్ చేతులు కదిలించి సైగలు చేశాడనే కారణంతో అంపైర్ ఆ బంతిని ‘డెడ్ బాల్’గా ప్రకటించాడు. ఈ నిర్ణయంతో జింబాబ్వే బౌలర్ ఈవాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.

అంపైర్ నిర్ణయం తర్వాత వేసిన తదుపరి బంతిని మహేదీ హసన్ బౌండరీగా మలిచి బంగ్లాదేశ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. విజయం సాధించిన వెంటనే మహేదీ హసన్, బ్రాడ్ ఈవాన్స్ మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ పరస్పరం దూషించుకుంటూ శృతిమించడంతో శారీరక ఘర్షణకు దిగేంత పని చేశారు. దీంతో జింబాబ్వే ఫీల్డర్లు వెంటనే స్పందించి ఇద్దరినీ విడదీయాల్సి వచ్చింది.

డెడ్ బాల్ నియమం ఏం చెబుతోంది?

క్రికెట్ నిబంధనల ప్రకారం.. బౌలర్ బంతిని విసరడానికి పరిగెత్తే సమయంలో ఏ ఫీల్డర్ అయినా బ్యాటర్‌ను పక్కదారి పట్టించేలా లేదా ఇబ్బంది పెట్టేలా అనవసర కదలికలు చేస్తే అంపైర్ దాన్ని డెడ్ బాల్‌గా ప్రకటించవచ్చు. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ చేసిన కదలిక బ్యాటర్ ఏకాగ్రతను దెబ్బతీసేలా ఉందని భావించిన అంపైర్ తీసుకున్న నిర్ణయం నిబంధనల ప్రకారం సరైనదే అయినప్పటికీ, జింబాబ్వే ఆటగాళ్లు మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోయారు.

సొంతగడ్డపై సిరీస్ కోల్పోయిన జింబాబ్వే..

అంతకుముందు బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టులో డియాన్ మైయర్స్ 74 పరుగులు, బ్రయాన్ బెన్నెట్ 47 పరుగులతో రాణించడంతో ఆ జట్టు 143 పరుగులు సాధించగలిగింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ చక్కటి ప్రదర్శన చేశారు. చివరలో మహేదీ హసన్ చేసిన మెరుపులతో బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..