July 18, 2026

Hyderabad: మహిళా హాస్టళ్లు, పీజీలకు కొత్త రూల్స్.. రిజిస్ట్రేషన్ లేకపోతే అంతే సంగతులు..!

Hyderabad: మహిళా హాస్టళ్లు, పీజీలకు కొత్త రూల్స్.. రిజిస్ట్రేషన్ లేకపోతే అంతే సంగతులు..!
Reading Time: 2 minutes
Hyderabad: మహిళా హాస్టళ్లు, పీజీలకు కొత్త రూల్స్.. రిజిస్ట్రేషన్ లేకపోతే అంతే సంగతులు..!

హైదరాబాద్ మహానగరంలో ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం వచ్చి మహిళా హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ (PG) వసతి గృహాల్లో నివసిస్తున్న మహిళలు, విద్యార్థినుల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు హైదరాబాద్ నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (HCSC), యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థల సహకారంతో ‘ప్రాజెక్ట్ సేఫ్ స్టే’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ‘సురక్ష నివాస్ 1.0’ మార్గదర్శకాలను బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సంయుక్తంగా ఆవిష్కరించారు. అనంతరం హాస్టళ్లు, పీజీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి కొత్త భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. ఇకపై నగరంలోని ప్రతి మహిళా హాస్టల్, పీజీ నిర్వాహకుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకోసం కొత్తగా రూపొందించిన రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం ఫామ్-ఏను పూర్తి చేసి పోలీసులకు సమర్పించాలని సూచించారు. ఈ చర్యల ఉద్దేశం నిర్వాహకులను ఇబ్బంది పెట్టడం కాదని, మహిళల భద్రతకు కనీస ప్రమాణాలు అమలు చేయడమేనని చెప్పారు. త్వరలోనే హాస్టళ్ల భద్రత పర్యవేక్షణ కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

హాస్టళ్లలో భద్రతా పరిస్థితులపై నిర్వహించిన ప్రత్యేక సర్వేలో పలు లోపాలు బయటపడినట్లు సీపీ తెలిపారు. నగరంలోని 447 మహిళా హాస్టళ్లను 10 ప్రత్యేక బృందాలు తనిఖీ చేయగా, 97.5 శాతం హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ, కేవలం 43 శాతం హాస్టళ్లకు మాత్రమే సరైన కాంపౌండ్ వాల్ ఉన్నట్లు గుర్తించారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో కీలకమైన అగ్నిమాపక పరికరాలు కేవలం 38.9 శాతం హాస్టళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ లోపాలను సరిదిద్దేందుకు కొత్త మార్గదర్శకాలను రూపొందించినట్లు హైదరాబాద్ సీపీ తెలిపారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. హాస్టళ్ల నిర్వహణ పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపమేనని, అందువల్ల ప్రతి నిర్వాహకుడు తప్పనిసరిగా మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ పొందాలని సూచించారు. భోజనం అందించే హాస్టళ్లు తప్పనిసరిగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ కలిగి ఉండాలని, లేకుంటే వాటిని అనధికారిక వసతి గృహాలుగా పరిగణిస్తామని హెచ్చరించారు. హాస్టల్‌కు వచ్చే, వెళ్లే ప్రతి వ్యక్తి వివరాలను నమోదు చేసే రిజిస్టర్ నిర్వహించడం, సిబ్బందికి పోలీస్ వెరిఫికేషన్ చేయించడం, సీసీటీవీలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించడం తప్పనిసరి అని పేర్కొన్నారు.

హైదరాబాద్ జిల్లా ఫైర్ ఆఫీసర్ టి. వెంకన్న మాట్లాడుతూ.. ప్రతి హాస్టల్‌లో అత్యవసర పరిస్థితుల కోసం రెండో మెట్ల మార్గం ఉండాలని, ప్రతి అంతస్తులో ఫైర్ ఎక్స్‌టింగిషర్లు ఏర్పాటు చేయడంతో పాటు హోస్ రీల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పి. మూర్తి మాట్లాడుతూ.. హాస్టళ్లలో ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, పరిశుభ్రత లేకపోయినా, నాసిరకం ఆహారం అందించినా లేదా నిబంధనలు ఉల్లంఘించినా క్రిమినల్ కేసులు నమోదు చేసి భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. హాస్టళ్ల నిర్వహణను కేవలం వ్యాపారంగా కాకుండా సామాజిక బాధ్యతగా చూడాలని సూచించారు. భద్రతా ప్రమాణాలు పాటించి, సేఫ్టీ రేటింగ్ మెరుగుపర్చుకుంటే నిర్వాహకులపై ప్రజల విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. మొత్తం మీద నగరంలో మహిళలు భయాందోళనలు లేకుండా సురక్షితంగా నివసించే వాతావరణాన్ని కల్పించడమే ‘ప్రాజెక్ట్ సేఫ్ స్టే’ ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..