అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం! డబ్బులొచ్చే స్కీమ్ వర్తింపు

రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకాన్ని వీరికీ వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు.
అంగన్వాడీలకు వర్తింపు
తల్లికి వందనం పథకం అర్బన్, రూరల్ ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ సిబ్బంది అందరికీ వర్తించనుంది. చాలా కాలంగా వారు కోరుతున్న డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పలుమార్లు తమ విజ్ఞప్తులను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై సమగ్రంగా పరిశీలించిన ప్రభుత్వం చివరకు వారికి అనుకూల నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అంగన్వాడీ సిబ్బందికి ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది.
మంత్రి సంధ్యారాణి హర్షం
ఈ నిర్ణయంపై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు. అంగన్వాడీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్న సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు రాష్ట్ర అంగన్వాడీ కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం అంగన్వాడీ సిబ్బందిలో మరింత ఉత్సాహం, భరోసా నింపుతుందని చెప్పారు. ప్రభుత్వం తమ సేవలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకోవడం అంగన్వాడీ సిబ్బందికి గొప్ప గుర్తింపని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సేవలందిస్తున్న అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందనే సందేశాన్ని ఈ నిర్ణయం ఇస్తోందని ఆమె తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి