July 18, 2026

తిరుమలలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం…

తిరుమలలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం...
Reading Time: < 1 minute

తిరుమలలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం…

Caption of Image.

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం ( జులై 17 ) సాలకట్ల ఆణివార శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో రవిచంద్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. 

అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి దగ్గర ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు. అనంతరం పెద్దజీయర్‌స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. చిన్నజీయ‌ర్‌స్వామి, ఈవో, ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు.

ఆ తర్వాత శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో ”పరివట్టం”(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తరువాత అర్చకులు పెద్ద జీయంగారికి, చిన్న జీయంగారికి టీటీడీ తరఫున ఈవోకి ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు. ”రూపాయి” హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచ‌డంతో ఆణివార ఆస్థానం ముగిసింది.

©️ VIL Media Pvt Ltd.