July 18, 2026

Vadala Movie Review: సైకో క్రైమ్ థ్రిల్లర్ ‘వదలా’.. జగపతిబాబు, లయ మూవీ చూడొచ్చా? స్కిప్ చేయొచ్చా?

Vadala Movie Review: సైకో క్రైమ్ థ్రిల్లర్ 'వదలా'..  జగపతిబాబు, లయ మూవీ చూడొచ్చా? స్కిప్ చేయొచ్చా?
Reading Time: 2 minutes

Vadala Movie Review: సైకో క్రైమ్ థ్రిల్లర్ ‘వదలా’.. జగపతిబాబు, లయ మూవీ చూడొచ్చా? స్కిప్ చేయొచ్చా?

Caption of Image.

టాలీవుడ్ స్టార్ జగపతిబాబు, లయ.. వెండితెరపై ఒకప్పుడు వెలిగిపోయిన హిట్ జోడీ. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ సీనియర్ కాంబో మళ్లీ జతకట్టడంతో ‘వదలా’ సినిమాపై టాలీవుడ్‌లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ‘అంతఃపురం’ సినిమాతో నటిగా మెప్పించిన హృతిక శ్రీనివాస్ ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న సైకో క్యారెక్టర్‌లో నటించడంతో ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌పై ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెరిగింది. భారీ అంచనాల మధ్య ఈ రోజు ( జూలై 17, 2026)  థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందోచూద్దాం.

కథేంటంటే..

మధ్యప్రదేశ్‌లో స్థిరపడిన డాక్టర్ సిద్ధార్థ్ (జగపతిబాబు), లవ్లీ వైఫ్ ప్రియ (లయ)లది పాతికేళ్ల అన్యోన్య దాంపత్య జీవితం. ఇద్దరు పిల్లలతో హ్యాపీగా సాగిపోతున్న వీరి లైఫ్‌లోకి అముద (హృతిక శ్రీనివాస్) అనే యువతి ప్రవేశిస్తుంది. ఒక ఘోర రోడ్డు ప్రమాదం నుండి అముదను డాక్టర్ సిద్ధార్థ్ కాపాడతాడు. అయితే, ప్రాణాలు కాపాడిన డాక్టర్‌పై అమితమైన ఆరాధన పెంచుకున్న అముద.. అది కాస్తా ముదిరి అతడిని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనే సైకోలా మారుతుంది.

అక్కడితో ఆగకుండా ఆ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ గుర్తుతెలియని నంబర్ల నుండి ఫోన్లు, మెసేజ్‌లతో భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతుంది. ఈ క్రమంలోనే సిద్ధార్థ్ పిల్లల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తుంది. ఇంతకీ అముద ఎవరు? గతంలో బాంబు బ్లాస్ట్‌లో చనిపోయిన నివాస్ (శ్రీనివాస్ అవసరాల)కి ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? ఈ సైకో యువతి ప్లాన్స్ నుండి సిద్ధార్థ్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే..?

దర్శకుడు ఆకెళ్ల వి. కృష్ణ ఎంచుకున్న పాయింట్ బాగున్నా, కథనంలో కొత్తదనం లోపించింది. ఫస్ట్ హాఫ్  అంతా చాలా నెమ్మదిగా, ఒక సాధారణ ఫ్యామిలీ డ్రామాలా సాగుతుంది. ఒక వైపు అముద చేసే సైకో పనులు, మరోవైపు పోలీసులు జరిపే ఇన్వెస్టిగేషన్ సీన్లు సెకండాఫ్‌లో కాస్త సస్పెన్స్‌ను పెంచుతాయి. కొన్ని సీన్లు థ్రిల్ ఇస్తాయనిపించినా, ముందుకు వెళ్లేకొద్దీ కథనం రొటీన్ ఫార్మాట్‌లోకి వెళ్ళిపోతుందన్న అభిప్రాయాన్ని సినీ ప్రియులు వ్యక్తం చేస్తున్నారు..

ముఖ్యంగా, జగపతిబాబు – హృతిక మధ్య లవ్ అండ్ లస్ట్ ఎలిమెంట్స్‌ను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. క్లైమాక్స్‌లో ట్విస్ట్ రివీల్ అయ్యాక సినిమా అంతా ఊహాజనితంగా మారిపోతుంది. విలన్ క్యారెక్టర్ అంతలా టార్చర్ పెట్టినా, చివర్లో హీరో ఫ్యామిలీ అంతా సులువుగా మర్చిపోవడం లాజిక్‌కు దూరంగా అనిపిస్తుందంటున్నారు ప్రేక్షకులు. రెండు గంటల లోపు నిడివి ఉండటం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.

ఎవరెలా చేశారంటే..?

సిద్ధార్థ్ పాత్రలో జగపతిబాబు తన అనుభవజ్ఞుడైన నటనతో అలరించారు. ఫ్యామిలీని ప్రేమించే తండ్రిగా ఆయన నటన మెప్పిస్తుంది. హోమ్లీ వైఫ్‌గా లయ తన పాత్రకు న్యాయం చేసిందన్న ప్రశంసలు అందుకుంది. క్లైమాక్స్‌లో భర్తను కాపాడుకునే సీన్లలో లయ నటన బాగుంది. అయితే, ఈ సినిమాకు అసలైన సర్ప్రైజ్ ప్యాకేజ్ హృతిక శ్రీనివాస్. సైకో లక్షణాలున్న గ్లామరస్ యువతిగా భయపెడుతూనే, అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. శ్రీనివాస్ అవసరాల, రవివర్మ పాత్రలు పరిధి మేర ఉన్నాయి.

రొటీన్ సైకలాజికల్ థ్రిల్లర్..

రొటీన్ కథ, ఊహాజనిత స్క్రీన్‌ప్లే, లాజిక్ లేని క్లైమాక్స్ అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సాంకేతిక పరంగా చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. కార్తీక్ కొడకండ్ల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ సీన్లను ఎలివేట్ చేసింది. లక్ష్మీ భూపాల డైలాగ్స్ ఓకే. తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ విలువలు బాగున్నాయంటున్నారు. మొత్తానికి ఈ ‘వదలా’.. పాత చింతకాయ పచ్చడి లాంటి రొటీన్ సైకలాజికల్ థ్రిల్లర్ గా ఉందన్న మిశ్రమ స్పందన వస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ వీకెండ్ ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.

 

©️ VIL Media Pvt Ltd.